ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా సమాచారాన్ని అందించింది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ 12వ తేదీన ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సీఎంఓ ట్వీట్‌లో తెలిపింది. కృష్ణాజిల్లా గన్నవరం దగ్గరున్న కేసనపల్లి ఐటీ పార్క్ ఈ మహోత్సవానికి వేదిక కానున్నదని సీఎంఓ అధికారికంగా ప్రకటించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు ఎన్డీయే ముఖ్య నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచ్చేయనున్నారు.