Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం అయ్యింది. నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే రెండు పర్యాయాలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందళ్ల బ్యారేజీలను సందర్శించి లోపాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నివేదిక ప్రకారం ప్రభుత్వం బ్యారేజ్ ల రక్షణ, పునఃరుద్దరణ పనులను మూడు ఏజన్సీల ద్వారా చేపట్టి, లోపాలపై చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ తో విచారణ చేపట్టారు. జస్టిస్ చంద్ర ఘోష్ శనివారం పెద్దపల్లి జిల్లా సుందిళ్ల పార్వతి బ్యారేజీని సందర్శించి బ్యారేజీలో చేపట్టిన మరమ్మత్తు పనులను పరిశీలించారు. మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై విచారణలో భాగంగా సుందిళ్ల బ్యారేజీని సందర్శించినట్లు తెలిపారు. బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించి జరుగుతున్న పనులు, వినియోగించిన మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. పార్వతి బ్యారేజీ సందర్శన అనంతరం అన్నారం సరస్వతి బ్యారేజీ, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలను సందర్శించి పరిశీలించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎన్డీఎస్ఏ, జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చే నివేదికల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీలో సీఎస్ఎం ఆర్ఎస్ పరీక్షలు జరిగాయి.