Home తెలంగాణ ఉండవల్లి మొసలి కన్నీరు..! | undavalli arun kumar crocodile tears| ramoji| demice| condolence|...

ఉండవల్లి మొసలి కన్నీరు..! | undavalli arun kumar crocodile tears| ramoji| demice| condolence| netizens

0

posted on Jun 8, 2024 3:21PM

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే నెటిజనులు మాత్రం ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్  గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తరువాత జగన్ తరఫున రామోజీ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడమే ధ్యేయంగా మార్గదర్శి లక్ష్యంగా  పని చేశారని నెటిజనులు గుర్తు చేస్తున్నారు. 

ఉండవల్లి కేసుల ప్రాతిపదికగా  జగన్ రామోజీ అరెస్టే లక్ష్యంగా పావులు కదిపారు. జగన్ హయాంలో ఆయన కనుసన్నల్లో, ఆయన ఆదేశాల మేరకు పని చేసిన ఏపీ సీఐడీ ఆయనను వేధించింది. మార్గదర్శి కార్యాలయాలలో శోదాలు చేసింది. రామోజీ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడమే లక్ష్యంగా జగన్ సర్కార్ వేధింపులు, వేటకు రామోజీ బెదిరిపోలేదు. తాను ఏదైనా నమ్మారో దాని కోసం గట్టిగా నిలబడి పోరాడారు. దీంతో సీఐడీ ఏకంగా రామోజీరావు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి విచారణ నెపంతో వెళ్లింది. ఆయన ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫొటోలను లీక్ చేసింది. ఈ వేధింపులన్నీ ఉండవల్లి మార్గదర్శిపై పెట్టిన కేసులను ప్రాతిపదికగా తీసుకునే  జరిగాయి. 

ఆఖరికి అప్పటి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఒక సందర్భంగా జగన్ లక్ష్యం రామోజీ అరెస్టేననీ, అయితే అందుకు కేసీఆర్ అంగీకరించలేదనీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. దీంతోనే ఉండవల్లి మార్గదర్శిపై కేసుల వెనుక ఎవరున్నారో ఇట్టే అర్ధమైపోతుంది.  జగన్ కోసం రామోజీపై కేసులు పెట్టిన ఉండవల్లి ఇప్పుడు రామోజీ రావు మృతి పట్ల ప్రగాఢ సంతాపం అంటూ  మీడియా ముందుకు రావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రామోజీ మృతి పట్ల ఉండవల్లి సంతాపం వ్యక్తం చేస్తున్న వీడియో ఇప్పుడు తెగ ట్రోల్ అవుతోంది. నెటిజన్లు మొసలి కన్నీరు ఆపు ఉండవల్లీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఉండవల్లిది ఓవరేక్షన్ అంటూ ఏకి పారేస్తున్నారు.  

Exit mobile version