posted on Apr 27, 2024 9:37AM
అదలా ఉంచితే.. వైసీపీ కీలక నేతల నామినేషన్లే తిరస్కరణకు గురయ్యే పరిస్థితి వచ్చింది. విపక్ష నేతలపై అనుచిత భాషా ప్రయోగంతో రెచ్చిపోవడంలో చూపే శ్రద్ధ వైసీపీ నేతలు తమ ఎన్నికల నామినేషన్ల దాఖలుపై చూపలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి బుగ్గన, మాజీ మంత్రి కొడాలి నాని, పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ దాఖలు చేసిన నామినేషన్ లలో పూర్తి వివరాలు పొందుపరచలేదన్న ఆరోపణలపై వారి నామినేషన్ల ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి బుగ్గన ఎన్నికల అఫిడవిట్ లో లోపాలు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన డోన్ ఆర్డీవో ఆయన నామినేషన్ ను పెండింగ్ లో పెట్టారు. బుగ్గన తన అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు పొందుపరచలేదంటూ డోన్ తెలుగుదేశం అభ్యర్థి కోట్ల అభ్యంతరం తెలిపారు. దీంతో బుగ్గన నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో పెట్టి పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా సూచించారు. ఇక గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే.. బూతుల ఎక్స్పర్ట్ గా పేరొందిన కొడాలి నాని అయితే తన ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆధారాలతో సహా విపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. కొడాలి తన ఎన్నికల అఫిడవిట్ లో తాను ఎటువంటి ప్రభుత్వ భవనాన్ని వినియోగించలేదని వెల్లడించారు.
అయితే కొడాలి నాని ఎమ్మెల్యే గా ప్రభుత్వ భవనమైన మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయంగా వినియోగించారంటూ అందుకు తగ్గ సాక్ష్యాధారాలతో గుడివాడ తెలుగుదేశం నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసారు. భవనాన్ని అద్దెకు ఇచ్చినట్లుగా మున్సిపల్ అధికారులు ఇచ్చిన పత్రాలను ఆధారంగా చూపించారు. దీంతో కొడాలి నాని నామినేషన్ వివాదంలో పడింది. అయితే కొడాలి, బుగ్గన నామినేషన్లను ఆయా ఆర్వోలు చివరి నిముషంలో ఆమోదించారు. నిబంధనలకు విరుద్ధంగా వారి నామినేషన్లను ఆమోదించడంపై తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టపరంగా ముందుకు వెడతామని చెబుతున్నారు.