Home తెలంగాణ ఎన్నికల ప్రచారంలో విక్టరీ వెంకటేష్ | hero venkatesh to participate in election| campaign|...

ఎన్నికల ప్రచారంలో విక్టరీ వెంకటేష్ | hero venkatesh to participate in election| campaign| telugu| states| kahmmam| loksabha| kaikaluru| assembly| relatives

0

posted on Apr 27, 2024 11:48AM

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి వేసవి ఎండలను మించిపోయింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తై పోలింగ్ ఇక రోజుల వ్యవధిలోకి రావడంలో పార్టీలూ, పోటీలో ఉన్న అభ్యర్థులూ తమ ప్రచారాన్ని మరింత హోరెత్తించడానికి సమాయత్తమౌతున్నారు. పార్టీల అధినేతలు రోడ్ షోలు, భారీ బహిరంగ సభలతో ప్రచారంలోకి దూసుకుపోతున్నారు. సహజంగా తమ ప్రచారానికి సినీగ్లామర్ ను కూడా జోడించాలని సినీ పరిశ్రమతో సంబంధాలు, బంధుత్వాలు ఉన్న అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.

అందులో భాగంగానే టాలీవుడ్ కు చెందిన ప్రముఖులను ప్రచారంలోకి దింపుతున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా తమ బంధువులు, స్నేహితుల కోసం ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారు. 

ఇందులో భాగంగానే చీరాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న ఎంఎం కొండయ్యయాదవ్ తరఫున నటుడు నిఖిల్ సిద్ధార్థ  ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలో కూడా పాల్గొని తెలుగుదేశం కూటమి అభ్యర్థికి ఓటేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేసేందుకు పలువురు నటులు రంగంలోకి దిగారు. ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్, కమేడియన్ ఆది తదితరులు పిఠాపురంలో మకాం వేసి జనసేనాని తరఫున ప్రచారం చేస్తున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తన బాబాయ్ పవన్ కల్యాణ్ కు మద్దతుగా శుక్రవారం పిఠాపురంలో సందడి చేశారు. రానున్న రోజులలో మెగా హీరోలంతా కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. అలాగే మెగా హీరో చిరంజీవి కూడా పవన్ కల్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

అదే విధంగా సాధారణంగా రాజకీయాలకూ పూర్తిగా దూరంగా ఉండే వెంకటేష్ కూడా ఈ సారి ఎన్నికల ప్రచార రంగంలో  కీలకంగా వ్యవహరించనున్నారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పోటీలో ఉన్న తన బంధువుల తరఫున ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణలో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన వియ్యంకుడు రామసహాయం రాఘవ రెడ్డి తరఫున వెంకటేష్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కైకులూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివస్ తరఫున కూడా వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కామినేని శ్రీనివాస్ వెంకటేష్ సతీమణి నీరజకు స్వయాన మేనమామ. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల బరిలో నిలిచిన తన సమీప బంధువుల తరఫున వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. 

Exit mobile version