Home రాశి ఫలాలు Akshaya tritiya 2024: అక్షయ తృతీయ అంటే ఏంటి? ఆరోజు నిజంగానే బంగారం కొంటె మంచిదా?...

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ అంటే ఏంటి? ఆరోజు నిజంగానే బంగారం కొంటె మంచిదా? దీని వెనుక కారణం ఏంటి?

0

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ నుంచే కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు మహావిష్ణువు పరశురామ అవతారాన్ని ధరించాడని భావిస్తారు.

శుభకరమైన అక్షయ తృతీయ రోజు రాహుకాలం , వర్జ్యం, దుర్ముహూర్తం వంటి వాటితో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఎటువంటి శుభకార్యాల నైనా నిర్వహించుకుంటారు. నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది కూడా అక్షయ తృతీయ రోజే అనే పురాణాలు చెబుతున్నాయి.

బద్రీనాథ్ లోని ఆలయాన్ని అక్షయ తృతీయ రోజు తెరిచే ఉంచుతారు. ఇలా అక్షయ తృతీయ అన్ని విధాలుగా మంచి రోజుగా పరిగణిస్తారు. సాధారణంగా అక్షయ తృతీయ అంటే బంగారం కొనేందుకు మంచి రోజు అని భావిస్తారు. అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా బంగారం కొనాలని అందురూ నమ్ముతారు కానీ నిజంగా బంగారం కొనాలా? అసలు అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చింది? అని వివరాలు తెలుసుకుందాం.

అక్షయ తృతీయ అంటే ఏంటి?

సంపదకు అధి దేవతగా లక్ష్మీదేవిని భావిస్తారు. మహావిష్ణువుకి ప్రీతికరమైనది ప్రతిదీ మహాలక్ష్మి కూడా ఇష్టమే. అటువంటి మహావిష్ణువు పరుశురాముడు అవతారం ధరించిన రోజు ఏమి చేసినా అది అక్షయంగా మిగిలిపోతుందని అంటారు. ఆరోజు చేసే పూజలు, పుణ్యకార్యాలు, దానధర్మాలు ఎన్ని జన్మలకైనా ప్రతిఫలాన్ని ఇస్తాయి. అందుకే అక్షయ తృతీయ రోజు అందరూ తమ శక్తి మేరకు దానాలు చేస్తారు. ఈ పుణ్యఫలం జన్మజన్మలకు తోడు ఉంటుందని భావిస్తారు. అక్షయం అంటే క్షయం కాని ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈరోజుకి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది.

బంగారం ఎందుకు కొంటారు?

అక్షయ తృతీయ అంటే అందరికీ బంగారం కొనడమే గుర్తుకు వస్తుంది. ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చిన నివసిస్తుందని నమ్ముతారు. అందుకే బంగారం కొనడం, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం చేస్తారు. అయితే అక్షయ తృతీయ రోజు ఎటువంటి పుణ్యకార్యం చేసిన దాని ఫలితం శాశ్వతంగా ఉండిపోతుంది. అంతే కానీ బంగారం మాత్రమే కొనాలనే నియమం ఏమి లేదు.

అక్షయ తృతీయ నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఆచరించాలి. అక్షతలను మహావిష్ణువు పాదాలపై ఉంచి పూజ చేసిన తర్వాత వాటిలో కొన్ని జాగ్రత్తగా ఏరి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. మిగిలిన బియ్యాన్ని దేవుడి ప్రసాదంగా వండి స్వీకరించాలి. ఈ వ్రతం చేసిన తర్వాత వచ్చే పన్నెండు మాసాలలో ప్రతి శుక్ల తృతీయ నాడు ఉపవాసం చేసి విష్ణువుని ఆరాధించడం వల్ల రాజసూయ యాగం చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

అక్షయ తృతీయ రోజు ఏది కొంటే అది రెట్టింపు అవుతుందని ప్రతీక. అందుకే మహాలక్ష్మికి సంబంధించి బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అయితే ఈరోజు బంగారం మాత్రమే కాదు ఏది కొనుగోలు చేసిన అది మంచి ఫలితాన్ని ఇస్తుంది.

అక్షయ తృతీయ రోజు చేయకూడని పనులు

మహా విష్ణువు, లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ఇది. అందుకే ఈరోజు ఎటువంటి పాపకార్యాలు చేయకూడదు. చెడు ఆలోచనలు, ఇతరులను దూషించడం మాటలతో వేధించడం వంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈరోజు ఏ పని చేసినా దాని ఫలితం అక్షయం. అందుకే అది జన్మ జన్మలకు వెంటాడుతుంది. అలాగే మీరు చేసే దానం మీ శక్తి కొలది మాత్రమే చేయాలి. అప్పులు చేసి ఇబ్బందులు పడుతూ దానాలు చేయడం మంచిది కాదు.

Exit mobile version