Thursday, January 23, 2025

నా బిడ్డను అన్యాయంగా అరెస్టు చేశారు.. కేసీఆర్ సెంటిమెంట్ ఓట్లు రాలుస్తుందా? | kcr daughter arrest sentiment gain sypmathy| voters| brs

posted on Apr 26, 2024 12:44PM

కేసీఆర్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ను పండించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కారణాలేమైతేనేం చాలా రోజుల పాటు ఎక్కడా బహిరంగంగా మాట్లాడని ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు వచ్చారు. బస్సు యాత్ర పేరుతో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటున్నారు. బస్సు యాత్రకు ముందు ఓ టీవీ చానెల్ లో మాట్లాడిన ఆయన మేడిగడ్డ కుంగుబాటు చాలా చిన్నదనీ, అటువంటివి సహజమనీ చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఫోన్ ట్యాపింగ్ ను కూడా ఆయన అటువంటిది జరిగితే అది అధికారుల తప్పు తనకేం సంబంధం అని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఇలా అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో  ముఖ్యమంత్రిగా తాను రాష్ట్ర ప్రగతి, పురోగతే లక్ష్యంగా పని చేశానని చెప్పుకున్నారు. అయితే ఆయన మాటలను జనం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ పండించైనా సరే ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం మొదలు పెట్టారు.  తెలంగాణను పార్టీ పేరు నుంచే దూరం చేసుకున్న ఆయన ఇప్పుడు తెలంగాణ సాధకుడిని అని చెప్పుకుంటే జనం మెచ్చరనుకున్నారో ఏమో.. కుమార్తె అరెస్టు అంశాన్ని ఎత్తుకున్నారు.  తన బిడ్డను అక్రమంగా అరెస్టు చేశారంటూ సెంటిమెంట్ పండించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన తరువాత చాలా రోజుల వరకూ కనీసం స్పందించలేదు. అదే కేసులో ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్టు చేసినప్పుడు ఖండించిన కేసీఆర్.. తన కుమార్తె అరెస్టుపై మాత్రం మాట్లాడలేదు. ఇప్పుడు ఇన్ని రోజుల తరువాత ఎన్నికల ప్రచారంలో కవితను అన్యాయంగా జైల్లో పెట్టారంటూ సానుభూతి పొందే యత్నం చేస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా భువనగిరిలో ఆయన మాట్లాడుతూ..కవిత అరెస్టు విషయాన్ని ప్రస్తావించారు. తప్పుడు కేసులో కవితను బీజేపీ సర్కార్ జైల్లో పెట్టిందన్న కేసీఆర్ ఈ సంఘటన బీజేపీ కపటత్వానికి నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణించారు. తన కుమార్తెకు నిజంగా మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉంటే అసెంబ్లీ ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.   

వాస్తవానికి కవిత అరెస్టైన సందర్భంలోనే తెలంగాణ సమాజం సీరియస్ గా తీసుకోలేదు.  ఆమె అరెస్టైన సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త నిరసనల పిలుపునకు ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. అప్పట్లో కవిత అరెస్టు సార్వత్రిక ఎన్నికలలో  కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందన్న విశ్లేషణలు కూడా వెలువడ్డాయి.    తెలంగాణ ఉద్యమ నేత, ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ పితగా నిన్నటి వరకూ ప్రజల మన్ననలు అందుకున్న కేసీఆర్ తనయను ఈడీ అరెస్టు చేస్తే తెలంగాణ ప్రజలు పెద్దగా స్పందించలేదు. రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగలేదు. చాలా ఉదాశీనంగా వ్యవహరించారు.

ఇక కవిత పట్ల ప్రజల నుంచే కాదు, పార్టీ శ్రేణుల నుంచి కూడా ఏ మంత సానుభూతి లభించలేదు. పైపెచ్చు అవినీతికి పాల్పడితే అనుభవించక తప్పదుకదా అన్న వ్యాఖ్యలూ వినవచ్చాయి. వాటన్నిటి కారణంగానే కేసీఆర్ కవిత అరెస్టుపై స్పందించేందుకు వెనుకాడారనీ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఇక లోక్ సభ ఎన్నికల ముంగిట కవిత అరెస్టును తురుఫు ముక్కగా వాడుకోవాలని చూస్తున్న కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana