posted on Apr 26, 2024 12:44PM
మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన తరువాత చాలా రోజుల వరకూ కనీసం స్పందించలేదు. అదే కేసులో ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్టు చేసినప్పుడు ఖండించిన కేసీఆర్.. తన కుమార్తె అరెస్టుపై మాత్రం మాట్లాడలేదు. ఇప్పుడు ఇన్ని రోజుల తరువాత ఎన్నికల ప్రచారంలో కవితను అన్యాయంగా జైల్లో పెట్టారంటూ సానుభూతి పొందే యత్నం చేస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా భువనగిరిలో ఆయన మాట్లాడుతూ..కవిత అరెస్టు విషయాన్ని ప్రస్తావించారు. తప్పుడు కేసులో కవితను బీజేపీ సర్కార్ జైల్లో పెట్టిందన్న కేసీఆర్ ఈ సంఘటన బీజేపీ కపటత్వానికి నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణించారు. తన కుమార్తెకు నిజంగా మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉంటే అసెంబ్లీ ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
వాస్తవానికి కవిత అరెస్టైన సందర్భంలోనే తెలంగాణ సమాజం సీరియస్ గా తీసుకోలేదు. ఆమె అరెస్టైన సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త నిరసనల పిలుపునకు ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. అప్పట్లో కవిత అరెస్టు సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందన్న విశ్లేషణలు కూడా వెలువడ్డాయి. తెలంగాణ ఉద్యమ నేత, ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ పితగా నిన్నటి వరకూ ప్రజల మన్ననలు అందుకున్న కేసీఆర్ తనయను ఈడీ అరెస్టు చేస్తే తెలంగాణ ప్రజలు పెద్దగా స్పందించలేదు. రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగలేదు. చాలా ఉదాశీనంగా వ్యవహరించారు.
ఇక కవిత పట్ల ప్రజల నుంచే కాదు, పార్టీ శ్రేణుల నుంచి కూడా ఏ మంత సానుభూతి లభించలేదు. పైపెచ్చు అవినీతికి పాల్పడితే అనుభవించక తప్పదుకదా అన్న వ్యాఖ్యలూ వినవచ్చాయి. వాటన్నిటి కారణంగానే కేసీఆర్ కవిత అరెస్టుపై స్పందించేందుకు వెనుకాడారనీ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఇక లోక్ సభ ఎన్నికల ముంగిట కవిత అరెస్టును తురుఫు ముక్కగా వాడుకోవాలని చూస్తున్న కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది.