Karimnagar District Crime News : కన్నకొడుకునే కడతేర్చాడు తండ్రీ. కళ్ళకు కారం పెట్టి…రోకలి తో తలపై కొట్టి ప్రాణం తీశాడు.ఈ దారుణ ఘటన కరీంనగర్(Karimnagar) జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో జరిగింది. చింతకుంట గ్రామానికి చెందిన పెరుమళ్ళ రాజకుమార్ (20) హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు. సెలవులపై ఇంటికి వచ్చిన రాజ్ కుమార్ ను కన్నతండ్రి పెరుమండ్ల శ్రీనివాస్ (50) దారుణంగా హత్య చేశాడు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికి మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న కొడుకుపై దాడి చేశాడు. తల్లి ఉపాధి హామి కూలీ పనికి వెళ్ళగా ఉదయం పది అయినా కొడుకు నిద్ర లేకపోవడంతో ఆగ్రహంతో తండ్రీ కళ్ళల్లో కారంపొడి చల్లి, రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో బెడ్ పైనే కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. కోపంతో కొడుకును చంపిన తండ్రీ నేరుగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు.
మద్యం మత్తే హత్యకు కారణమా..?
హైదరాబాదులో చదువుకుంటున్నానని చెప్పే కొడుకు రాజ్ కుమార్ నిత్యం మద్యం మత్తులో జోగుతాడని స్థానికులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన కొడుకు మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. కొడుకుతో ఇబ్బందులు ఎదుర్కొన్న తల్లిదండ్రులు పలుమార్లు మందలించిన అతని తీరు మార్చుకోలేదని స్థానికులు చెప్పారు. రాత్రి మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రుల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించి తెల్లవారుజామున నిద్రపోయాడని తెలిపారు. కొడుకు నిద్ర లేవకముందే ఉదయం తల్లి ఉపాధి హామీ కూలి పనికి వెళ్ళగా.. నిత్యం మద్యం మత్తులో కొడుకు పెట్టే ఇబ్బందులను భరించలేని ఆ తండ్రి ఆగ్రహంతో అదను చూసి కళ్ళలో కారం కొట్టి రోకలిబండతో తలపై బాధడంతో ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపారు. కొడుకు పెట్టే ఇబ్బందులు భరించలేకనే హత్య చేశానని తండ్రి సైతం పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
క్షణికావేశం.. కటకటాల పాలు
క్షణికావేశంతో కన్న కొడుకు ను కడతేర్చడంతో తండ్రి కటకటాల పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉపాధి హామీ పనికి వెళ్లి వచ్చేసరికి జరగకూడని దారుణం జరగడంతో తల్లి కన్నీరుమున్నీగా విలపించింది. కొడుకు నిర్జీవంగా మారడం.. కట్టుకున్న భర్త కటకటాలు పాలు కావడంతో దిక్కులేని ఆ తల్లి వేదన వర్ణనాతీతంగా మారింది. కడుపున పుట్టిన కొడుకును సన్మార్గంలో నడిపించాల్సిన పేరెంట్, దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం సృష్టించింది.