Home తెలంగాణ గుడివాడ, గన్నవరం వైసీపీలో కనిపించని జోష్.. ముందుగానే చేతులెత్తేసిందా? | josh disappear in gudiwada...

గుడివాడ, గన్నవరం వైసీపీలో కనిపించని జోష్.. ముందుగానే చేతులెత్తేసిందా? | josh disappear in gudiwada and gannavaram ycp| cadre| hands| up| nomination| rallies| indicate

0

posted on Apr 26, 2024 11:11AM

గుడివాడ, గన్నవరం.. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు చోట్లా కూడా వైసీపీ అభ్యర్థుల తీరు, భాష పట్ల ఆయా నియోజకవర్గాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ వైసీపీ గాంభీర్యం పదర్శిస్తూ  విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇరువురూ కూడా తెలుగుదేశంతో రాజకీయ అడుగులు మొదలు పెట్టిన వారే. అయితే కొడాలి నాని ముందుగా వైసీపీలోకి జంప్ కొడితే.. గత ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన తరువాత గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జంప్ కొట్టారు.

ఇరువురూ కూడా తెలుగుదేశం అధినేతపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నవారే. వారిరువురూ వారి వారి నియోజకవర్గాలలో తిరుగులేని నేతలుగా ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చారు. తీరా ఈ ఎన్నికలలో నామినేషన్ వేసే సమయానికి వారిరువురి ధీమా సన్నగిల్లినట్లు కనిపిస్తోంది. ఒక వైపు తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీ ఆర్భాటంగా ప్రజల భాగస్వామ్యంతో జరిగితే.. కొడాలి నాని, వల్లభనేని వంశీల నామినేషన్ ర్యాలీలో ప్రజా భాగస్వామ్యం మాట అటుంచి కనీసం పార్టీ క్యాడర్ లో కూడా ఉత్సాహం కనిపించలేదు. దీంతో ఇరువురిలోనూ ఓటమి భయం తీసుకువచ్చిన అసహనం పెచ్చరిల్లుతోందని అంటున్నారు. 

ముందుగా కొడాలి నాని విషయం తీసుకుంటు.. భారీ ర్యాలీతో తన నామినేషన్ ర్యాలీ నిర్వహించాలని కొడాలి నాని భావించారు. పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని పార్టీ క్యాడర్ కు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే గురువారం ( ఏప్రిల్ 25) కొడాలి నాని నామినేషన్ ర్యాలీ చూసిన వారు జోష్ కనిపించలేదంటున్నారు. అనుకున్న స్థాయిలో  జనం రాకపోవడంతో కవర్ చేసుకుందుకు తన నివాసం నుంచి కొడాలి నాని ర్యాలీని ఇరుకు సందుల గుండా నిర్వహించారు.  ఈ ర్యాలీలో నానితోపాటు వైసీపీ మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్‌, జడ్పీ  చైర్‌పర్సన్‌ ఉప్పల హారిక, పెడన వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము తదితరులు పాల్గొన్నారు. అనుకున్నస్థాయిలో  పార్టీ కార్యకర్తలు సైతం రాలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వచ్చిన వారు కూడా ఏదో మమ అన్నట్లుగా ర్యాలీలో పాల్గొన్నారు కానీ ఎవరిలోనూ నాని విజయం పట్ల ధీమా కనిపించలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నినాదాలలో జోష్ కనిపించలేదనీ, ర్యాలీని ఇరుకు రోడ్ల గుండా నిర్వహించడమే  ఆ ర్యాలీకి స్పందన కనిపించలేదనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. మొత్తం మీద గుడివాడలో కొడాలి నాని నామినేషన్ ర్యాలీ వెలవెలబోయి ఆయన గాలి తీసేసిందని అంటున్నారు.   భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన చేయాలని ఎంతగా ప్రయత్నించినా జనం మాత్రం రాలేదు. అసలు నాని ప్రచారంలోనే ఆయనకు ప్రజల నుంచి నిరసన వ్యక్తం అయ్యింది. ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధిని ఇసుమంతైనా పట్టించుకోని నానికి ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమైన దాఖలాలు లేవు. పైపెచ్చు ఎక్కడికక్కడ నిలదీతలు, నిరసనలే వ్యక్తం అయ్యాయి. అదే ఆయన నామినేషన్ ర్యాలీలోనూ ప్రతిఫలించింది. దీంతో నామినేషన్ ర్యాలీని తెలుగుదేశం కార్యాలయం మీదుగా నిర్వహించి గొడవలు సృష్టించాలని నాని వర్గం చేసిన ప్రయత్నం కూడా ఆ రూట్ లో ర్యాలీకి పోలీసులు ససేమిరా అనడంతో విఫలమైంది. రెండు రోజుల ముందుగానే గుడివాడ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెనిగండ్ల రాము ఆ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ ప్రజా భాగస్వామ్యంతో కళకళలాడింది. వేలాది మందితో సాగిన ఆయన నామినేషన్ ర్యాలీ విజయోత్సవాన్ని తలపించిందని స్థానికులు వ్యాఖ్యానించారు.  

 ఇహ ఇప్పుడు గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌ నామినేషన్‌  సందర్భంగా జరిగిన ర్యాలీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ర్యాలీకి జనాలను తరలించేందుకు  పెద్దఎత్తున డబ్బు, మద్యం, బిర్యానీ ప్యాకెట్ల పంపిణీ జరిగినా ప్రజలు మాత్రం ర్యాలీలో పాల్గొనేందుకు పెద్దగా ఉత్సాహం చూపలేదు.  ఆశించిన స్థాయిలో  జనాలు రాకపోవడంతో  వంశీ అసహనానికి లోనయ్యారు. నామినేషన్ అనంతరం ఆయన ప్రసంగంలో అది స్పష్టంగా ప్రతిఫలించింది.  గన్నవరం నియోజకవర్గంలో మండల, గ్రామ స్థాయిల్లో పలువురు నాయకులు తెలుగుదేశం గూటికి చేరిపోయారు. దీంతో క్షేత్రస్థాయిలో వైసీపీకి నాయకత్వమే లేకుండా పోయింది.  అదే గన్నవరం తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ నామినేషన్ ర్యాలీ వేలాది మందితో ఆద్యంతం ఉత్సాహంగా జారింది. ఈ ర్యాలీతో పోల్చి నామినేషన్ ర్యాలీయే గన్నవరం ఫలితాన్ని తేల్చేసిందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో వైసీపీలో జోష్ కనిపించడం లేదనీ, క్యాడర్ లో ఉత్సాహం కానరావడం లేదనీ, అదే ఆయా నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థుల ర్యాలీలో ప్రతిఫలించిందనీ చెబుతున్నారు.  

Exit mobile version