TSRTC Discount Offer 2024: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. బెంగళూరుకు వెళ్లే వారు ముందస్తుగానే టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటే… రాయితీని ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయణంపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ(TSRTC) కల్పిస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని హైఎండ్ సర్వీసుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులు ఈ 10 శాతం రాయితీని వినియోగించుకుని… టీఎస్‌ఆర్టీసీ (TSRTC)బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతోందని చెప్పారు.
శ్రీశైలానికి TSRTC ప్రత్యేక బస్సులు
TSRTC Srisailam Buses 2024: శ్రీశైలానికి ప్రత్యేక బస్సులను ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ(TSRTC). భక్తుల సౌకర్యార్థం శ్రీశైల(Srisailam) పుణ్యక్షేత్రానికి సరికొత్త రాజధాని ఏసీ బస్సులను నడుపుతోందని తెలిపింది. హైదరాబాద్ నుంచి ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ బస్సుల్లోజేబీఎస్ నుంచి రూ.524, BHEL నుంచి రూ.564 టికెట్ ధర ఉందని తెలిపారు. అత్యాధునిక హంగులతో ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా సంస్థ తయారు చేయించామని తెలిపారు. వేసవిలో చల్లదనం అందించే ఈ బస్సులను వినియోగించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని సంస్థ కోరుతుందని పేర్కొన్నారు. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించవచ్చని సూచించారు.
ఆవకాయ పచ్చడి ప్రియులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. రుచికరమైన అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడిని మీ బంధువులు, స్నేహితులకు TSRTC ద్వారా సులువుగా పంపించుకోవచ్చని తెలిపింది. మీ సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయ పచ్చడిని బంధుమిత్రులకు చేరేవేసే సదుపాయాన్ని సంస్థ కల్పిస్తోందని ఎండీ సజ్జనార్ ఇటీవలే తెలిపారు. తెలంగాణతో పాటు టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగే ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లకు ఆవకాయ పచ్చడిని సంస్థ డెలివరీ చేస్తోంది. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సూచించారు.