posted on Apr 23, 2024 11:20AM
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పాపులర్ కమేడియన్ గా సినిమాలలో ఓ వెలుగు వెలిగారు. ఆ తరువాత రాజకీయాలవైపు గాలి మళ్లడంతో రాజకీయ వేత్త అవతారమెత్తి వైసీపీ గూటికి చేరి.. 2019 ఎన్నికలకు ముందు ఆ పార్టీ క్యాంపెయినర్ గా ప్రత్యర్థులపై నోరు పారేసుకున్నారు. రాజకీయ విమర్శకు ఉండే మర్యాద హద్దు దాటి మరీ విమర్శలు గుప్పించారు. పార్టీ ప్రచారం అంటూ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. నోరున్నది ఎందుకు అంటే రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించడానికే అన్నట్లు పృధ్వివిరుచుకు పడ్డారు. జగన్ మెప్పు పొందడానికీ, ఆయన దృష్టిలో పడటానికీ అదే మార్గం అనుకున్నారు. మొత్తం మీద పృధ్వీ ప్రచారమే పని చేసిందో.. రాష్ట్ర ప్రజల దురదృష్టమో ఆ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
సహజంగానే, పార్టీ కోసం అంతగా కష్టపడిన పృధ్విని జగనన్న తనను అందలం ఎక్కిస్తారని ఆశపడ్డారు. అయితే ఆయన ఏమి ఆశ పడ్డారో, ఏమి ఆశించారో ఏమో తెలియదు కానీ పృధ్వీ పడిన కష్టానికి తగినదో కాదో మొత్తం జగన్ మాత్రం పృధ్వికి మొండి చేయి చూపించకుండా ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందనుకోండి అది వేరే సంగతి.
ఒక మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్ బాధ్యతల నుండి జగన్ పృధ్విని తప్పించారు. ఎస్వీబీసీ నుంచి గెంటేసిన తర్వాత వైసీపీలో ఆయ న్ని పట్టించుకున్నవారు లేరు. మరో వంక నడమంత్రపు సిరి శాశ్వతం నుకుని రెచ్చి పోయి వెనకా ముందు చూసుకోకుండా, చిందులేసిన పాపానికి ఇండస్ట్రీ కూడా పృధ్విని దాదాపు వదిలేసింది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిందేమిటంటే.. ఫృధ్వి ఎదుర్కొన్న లాంటి విమర్శలే ఎదుర్కొన్న అంబటి రాంబాబు మంత్రిగా పదోన్నతి పొంది కొనసాగుతున్నారు. అది పక్కన పెడితే వైసీపీ వదిలిం చేసుకున్న తరువాత థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తత్త్వం బోధపడినట్లుంది.
ఈ ఎన్నికల ముందు ఆయన వైసీపీ లక్ష్యంగా జనసేన తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ను ఓ ఆటాడేసుకుంటున్నారు. జగన్ లక్ష్యంగా కొన్ని ఆయన సంధిస్తున్న వ్యంగ్యాస్త్రాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఇటీవల జగన్ పై జరిగిన రాయిదాడి ఘటన అనంతరం పృధ్వి చేసిన వ్యాఖ్యలు వైసీపీని నవ్వుల పాలు చేశాయి. జగన్ అంటే ఎవరికైనా కోడి కత్తి, గొడ్డలి, కత్తి గుర్తుకు వస్తాయి కానీ గులకరాళ్లు గుర్తుకురావు అంటూ సెటైర్లు వేశారు. మొత్తం మీద జనసేన తరఫున ఫృద్వి చేస్తున్న ప్రచారానికి జనం నుంచి స్పందన అయితే వస్తున్నది. పృధ్వీయే నటించిన ఓటుతో జగన్ ను ఇంటికి పంపడం మాత్రమే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం అంటూ జనసేన రిలీజ్ చేసిన టీజర్ కు కూడా విశేష స్పందన లభించింది. మొత్తం మీద పృధ్వీ జగన్ పై ఓ రేంజ్ లో రివెంజ్ తీర్చుకుం టున్నారంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.