posted on Apr 20, 2024 4:32PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే సంపన్న సీఎం. గత ఏడాది ఏప్రిల్ లో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదిక పేర్కొన్న మేరకు 510 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో దేశంలోని ముఖ్యమంత్రులందరికంటే సంపన్నుడిగా తేలారు. కాగా గత ఎన్నిలలో జగన్ దాఖలు చేసిన అపిడవిట్ మేరకు ఆయన పేరున అప్పటికి 375 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. ఆయన భార్య భారతి పేర 124 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇక ఆయన కుమార్తెల పేర 11 కోట్ల రూపాయల విలువైన చరాస్తులున్నాయి. అంతే కాకుండా ఆ అఫిడవిట్ ప్రకారం వీటికి అదనంగా జగన్ పేర 317 కోట్ల పెట్టుబడులు ఉండగా, ఆయన సతీమణి భారతి పేర 62 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.
2019 ఎన్నికల సమయంలో జగన్ సమర్పించిన అఫిడవిట్ మొత్తం 47 పేజీలుంది. అందులో ఆయన ఆస్తులకు సంబంధించిన వివరాలు 11 పేజీలు. మిగిలిన 21 పేజీలూ జగన్ పై ఉన్న కేసుల వివరాలతో నిండిపోయింది. అప్పటి కి జగన్ పై మొత్తం 34 కేసులు ఉన్నట్లు జగన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ కేసులన్నీ సీబీఐ, ఈడీ, ఇతర కేసులకు సంబంధించినవే. ఈ ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ పై అదనంగా కేసులు నమోదైన దాఖలాలేవీ లేవు. అయితే పులివెందుల నుంచి ఎన్నికల బరిలో దిగనున్న జగన్ ఈ సారి సమర్పించే అఫిడవిట్ లో ఆయన ఆస్తులు ఏ మేరకు పెరిగాయన్నదానిపై అందరి ఆసక్తీ కేంద్రీకృతమై ఉందనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం మనమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ఉన్న జగన్ ఈ నెల 25న పులివెందులలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తం మీద దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిపై ఉన్న కేసుల సంఖ్య కూడా భారీగానే ఉందన్న సెటైర్లు గత ఏడాది అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ నివేదిక వెలువడిన నాటి నుంచీ పేలుతూనే ఉన్నాయి.