posted on Apr 20, 2024 4:32PM
2019 ఎన్నికల సమయంలో జగన్ సమర్పించిన అఫిడవిట్ మొత్తం 47 పేజీలుంది. అందులో ఆయన ఆస్తులకు సంబంధించిన వివరాలు 11 పేజీలు. మిగిలిన 21 పేజీలూ జగన్ పై ఉన్న కేసుల వివరాలతో నిండిపోయింది. అప్పటి కి జగన్ పై మొత్తం 34 కేసులు ఉన్నట్లు జగన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ కేసులన్నీ సీబీఐ, ఈడీ, ఇతర కేసులకు సంబంధించినవే. ఈ ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ పై అదనంగా కేసులు నమోదైన దాఖలాలేవీ లేవు. అయితే పులివెందుల నుంచి ఎన్నికల బరిలో దిగనున్న జగన్ ఈ సారి సమర్పించే అఫిడవిట్ లో ఆయన ఆస్తులు ఏ మేరకు పెరిగాయన్నదానిపై అందరి ఆసక్తీ కేంద్రీకృతమై ఉందనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం మనమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ఉన్న జగన్ ఈ నెల 25న పులివెందులలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తం మీద దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిపై ఉన్న కేసుల సంఖ్య కూడా భారీగానే ఉందన్న సెటైర్లు గత ఏడాది అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ నివేదిక వెలువడిన నాటి నుంచీ పేలుతూనే ఉన్నాయి.