posted on Apr 20, 2024 3:43PM
కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల రంగంలోకి దిగడం ఖాయమైన క్షణం నుంచే వైసీపీలో గాభరా ప్రస్ఫుటంగా కనిపించింది. వైఎస్ బిడ్డగా ఆమె కడప బరిలో అడుగుపెట్టడమే వైసీపీకి కాళ్ల కింద భూమిని తొలిచేసినట్లైంది. దీనికి తోడు ఆమె దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో కలిసి ప్రచార సభల్లో వైఎస్ జగన్ ను నిలదీస్తూ చేస్తున్న ప్రసంగాలకు కడప వాసుల నుంచి ఆమోఘమైన స్పందన లభించడంతో వైసీపీ అప్రమత్తమైంది. ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా ప్రజా మద్దతుతో షర్మిల వాటన్నిటినీ అధిగమించి ప్రచారాన్ని కొనసాగించడంతో వేసవి హీట్ ను మించి వైసీపీ టెంపరేచర్ పెరిగిపోయింది.
ఆమె సూటిగా సుత్తి లేకుండా, శషబిషలకు తావు లేకుండా వైఎస్ హంతకులకు కొమ్ము కాస్తున్న జగన్ కు, ఆయన పార్టీకీ ఓటువేయవద్దంటూ ఇచ్చిన పిలుపు జిల్లాలో రాజకీయ ఈక్వేషన్లను ఒక్క సారిగా మార్చేసింది. ఇక వైఎస్ సునీత అయితే అవినాషే మా నాన్న హంతకుడు అని ప్రకటించి మరీ జగన్ కు ఓటేయద్దని కోరుతున్నారు. సీబీఐ చార్జి షీట్ లోని అంశాలను పూసగుచ్చినట్లు ప్రజలకు వివరిస్తూ వివేకా హత్య ను కడప ఎన్నికల అజెండాగా మార్చేశారు.
మరో వైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ను చెళ్లెళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పు జగన్ అంటూ.. హే కిల్డ్ బాబాయ్ అంటూ నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కడపలో పట్టు జారిపోతోందని భయపడిన జగన్ అండ్ కో వివేకా హత్య కేసు గురించి ఆ ఏడుగురూ మాట్లాడకూడదంటూ గాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఏడుగురూ ఎవరంటే షర్మిల, సునీత, తెలుగుదేశం అధినేత అధినేత చంద్రబాబునాయుడు, జనసేన దళపతి పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, తెలుగుదేశం పులివెందుల అభ్యర్ధి బీటెక్ రవి. అయితే ఈ గాగ్ ఆర్డర్ పై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఇప్పటికే సునీత ప్రకటించారు. అయితే ఈ తీర్పును బట్టి చూస్తే ఆ ఏడుగురు వినా ఇంకెవరైనా వివేకా హత్య కేసుపై మాట్లాడొచ్చు అన్నట్లుగానే ఉంది. ఈ విషయాన్నే ఇటీవలే వైసీపీ నుంచి తెలుగుదేశం గూటికి చేరిన రఘురామకృష్ణం రాజు వంటి వారు ఎత్తి చూపుతూ షర్మిల సునీతల తరఫున ప్రచారం చేసే ఎవరైనా వివేకా హత్య కేసుకు సంబంధించిన ఆరోపణలు చేయవచ్చని అంటున్నారు. అసలు ఏకపక్షంగా ఓ ఏడుగురు ఫలానా అంశంపై మాట్లాడకూడదంటూ వెలువడిన తీర్పు ఉన్నత న్యాయస్థానంలో నిలిచే అవకాశలు లేవని కూడా అంటున్నారు. ఏపీలో గాగ్ ఆర్డర్లన్నీ వైసీపీ వారే తెచ్చుకుంటుండటం గమనార్హం.
గతంలో మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఓ మహిళతో మాట్లాడిన ఆడియో లీక్ సంచలనం సృష్టించింది. ఆ ఆడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లి, దానిని ప్రచురించి-ప్రసారం చేయకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత పులివెందులలోని తన సొంత ఇంట్లో మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద దారుణహత్యకు గురయ్యారు. జగన్‌కు చెందిన సొంత మీడియాతోపాటు, ఎంపి విజయసాయిరెడ్డి, అవినాష్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ వంటి నేతలు.. అప్పుడు దానిని గుండెపోటు అని ప్రకటించారు. తర్వాత రక్తపువాంతులన్నారు. ఆ తర్వాత హత్య అన్నారు. చివరకు దానిని చంద్రబాబునాయుడు చేయించారని ఆరోపించారు. వైసీపీ మీడియాలో నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఆ తర్వాత దానిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తి టీడీపీ నాయకులు, తెలుగు మీడియా చర్చించడం ప్రారంభించింది. దానితో భయపడిన వైసీపీ వివేకా హత్యపై ఎవరూ రాయవద్దని గ్యాగ్ ఆర్డరు తెచ్చుకుంది. దానితో ఆ ఎన్నికల్లో వివేకా హత్య సానుభూతితో వైసీపీ ఓట్లు కొల్లగొట్టింది.
ఐదేళ్ల తర్వాత.. మళ్లీ తన తండ్రి-చిన్నాయన హత్యపై, సునీత-షర్మిల కడప పార్లమెంటు పరిథిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గళం విప్పుతున్నారు. నేరుగా అవినాషే హంతకుడు అని ఆరోపిస్తూ ప్రచారం చేస్తున్నారు. వారి ప్రచారం కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ప్రభావం చూపుతుండటంతో జగన్ ఆందోళనతోనే గాగ్ ఆర్డర్ ద్వారా చెల్లెళ్ల నోరు మూయించే యత్నం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలానా వ్యక్తులు వివేకా హత్యపై మాట్లాడవద్దని ఆర్డరు తెచ్చుకున్న వైసీపీ.. మరి తన మీడియాలో అదే వ్యక్తులపై చల్లుతున్న బురద-చేస్తున్న విమర్శల సంగతేమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అప్పుడు వివేకా హత్యపై నారాసురరక్త చరిత్ర, ఇప్పుడు బెజవాడ రాయి దాడిపై చేస్తున్న ఆరోపణలపైనా.. ఇలాగే కోర్టుకు వెళ్లి ఆర్డరు తెచ్చుకోవ చ్చా? అని మరికొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.