ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అంటూ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి, ప్రస్తుతం తిహార్ జైల్లో వున్నారు. జైల్లో వున్నప్పటికీ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న కేజ్రీవాల్ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ఇదిలా వుంటే, కేజ్రీవాల్‌కి ఇంటి నుంచి ఆహారం తెప్పించుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. కేజ్రీవాల్‌కు మధుమేహం వుంది. కేజ్రీవాల్ ఇంటి నుంచి మామిడిపళ్ళు, అరటిపళ్ళు, పూరీ, స్వీట్లు తెప్పించుకుని తింటున్నారని, దానివల్ల ఆయన శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ రెట్టింపు అయ్యాయని ఈడీ చెబుతోంది. శరీరంలో సుగర్ని పెంచుకోవడం ద్వారా అనారోగ్యాన్ని పెంచుకుని, ఆ కారణాలు చూపించి బెయిల్ పొందాలన్నది కేజ్రీవాల్ వ్యూహంగా ఈడీ ఆరోపిస్తోంది.
ఇదిలావుంటే, కేజ్రీవాల్‌ను జైల్లోనే చంపడానికి కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. గ్లూకో్జ్ లెవల్స్ పెరిగిపోయిన కేజ్రీవాల్‌కి ఇన్సులిన్ ఇవ్వడానికి జైలు అధికారులు నిరాకరిస్తున్నారని, దీనివల్ల ఆయన ఆరోగ్యం మీద ప్రభావం పడి, నెమ్మదిగా మరణించేలా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్‌కు ఇన్సులెన్ ఇవ్వకపోవడం వల్ల ఆయన గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. రెండు మూడు నెలల పాటు ఆయన్ని ఇలాగే జైలులో వుంచి, ఆ తర్వాత విడుదల చేసినా ఏమాత్రం ప్రయోజనం వుండదు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని అన్నారు.