posted on Apr 17, 2024 10:19AM
కేసీఆర్ ఊహిస్తున్న దాని ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరం కూడా వుండే పరిస్థితి కనిపించడం లేదట. ఆయనకి అలా ఎందుకు అనిపిస్తోందో మాత్రం ఈ సిద్ధాంతి చెప్పడం లేదు. అదేవిధంగా ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 2 పార్లమెంటు స్థానాల కంటే ఎక్కువ వచ్చే అవకాశం కనిపించడం లేదట. దేశంలో జరుగుతున్న సర్వేలన్నీ ఈసారి టీఆర్‌ఎస్‌కి రెండు పార్లమెంట్ స్థానాలు వచ్చేది కూడా డౌటేనని కోడై కూస్తుంటే, ఈ సిద్ధాంతి మాత్రం కాంగ్రెస్‌కి రెండు స్థానాలకు మించి రావని భవిష్యత్తు వాణి వినిపిస్తున్నారు.
మొన్నటి ఎన్నికలలో కేసీఆర్ని తిప్పతిప్పి కొట్టి అధికార పీఠం నుంచి కిందకి లాగిన రేవంత్ రెడ్డి ఒక లిల్లీపుట్ అంట. ఈయన మాత్రం పెద్ద ఆజానుబాహుడైనట్టు. ప్రజలు ప్రలోభాలకు లొంగిపోయి కాంగ్రెస్‌కి ఓటు వేసి గెలిపించారట. ఇప్పుడు తప్పు తెలుసుకుని బాధపడుతున్నారట.
నిన్న హైదరాబాద్ శివార్లలోని సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తుంటే ‘చింత చచ్చినా పులుపు చావలేదు’ అనే సామెత కనిపెట్టిన వాడికి పొర్లు దండాలు పెట్టాలన్నంత గౌరవం ఏర్పడుతుంది. ఎందుకంటే, ఆ సామెతకి నిలువెత్తు నిదర్శనంగా ఆ సభలో కేసీఆర్ మరోసారి కనిపించారు. కేసీఆర్ మాటల్లో అదే అహంకారం, అవే అబద్ధాలు, అవే తిట్లు, శాపనార్థాలు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదట.. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలట. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు.. దుర్మార్గమైన పాలన చేశారు కాబట్టే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ప్రజలు భావిస్తే ఎన్నికల సందర్భంలో ఎలాగూ బుద్ధి చెబుతారు. అప్పటిదాకా అన్నీ మూసుకుని రెస్టు తీసుకోకుండా కేసీఆర్‌కి ఈ జ్యోతిషాలు, తిట్టు, శాపనార్థాలు ఎందుకంట?