posted on Apr 17, 2024 11:36AM
లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరుష పదాలతో చేసిన కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆయనకు మంగళవారం నోటీసులు జారీచేసింది. పార్టీ అధినేతగా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుకు గురువారం (ఏప్రిల్ 18) ఉదయం 11 గంటలకల్లా కమిషన్‌కు చేరేలా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్టును తెప్పించుకున్న తర్వాత ఈ నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని అవినాశ్ కుమార్ పేర్కొన్నారు.
సిరిసిల్లలో తన ప్రసంగంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతలపై కుక్కల కొడుకుల్లారా, లతుకోరులు, చవటదద్దమ్మలు వంటి పరుష పదాలను ప్రయోగించారు. అలాగే లతుకోరు ప్రభుత్వం, గొతుల్ని కోసేస్తాం, చంపేస్తాం వంటి వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయంటూ ఎన్నికల సంఘం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.