posted on Apr 16, 2024 4:07PM
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా ఆనవాళ్ళు ఉన్నాయి.ఎర్రని బట్టలు, బొమ్మ , పసుపు కుంకుమ, వెంట్రుకలు, నిమ్మకాయలు ఉండటంతో భయానకమైన పరిస్థితి కనిపిస్తోంది.అర్దరాత్రి ఈ క్షుద్ర పూజలు చేసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు జరగడం చర్చనీయాంశం అవుతోంది. ఎవరు క్షుద్రపూజలు చేశారు..? ఎవరిని టార్గెట్ చేసేందుకు ఈ పూజలు జరిపారు..? దీని వెనక ఎవరైనా ఉన్నారా..? రాజకీయ దురుద్దేశ్యంతోనే ఈ క్షుద్రపూజలకు పాల్పడ్డారా..? అనే విషయాలపై జోరుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలకు వేదిక చేసుకోవడం సంచలనంగా మారింది. కేసీఆర్ ఫ్యామిలీని ఆందోళనకు గురి చేసేందుకే ఇలాంటి ఏమైనా ప్లాన్ చేశారా..? అనే అనుమానాలను బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ సెంటిమెంట్లను ఎక్కువగా విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే ఆయన్ను మరింత ఒత్తిడిలోకి నెట్టేసేందుకు ఇలాంటి వాటికి తెరతీశారా..? అనే కోణంలో చర్చలైతే జరుగుతున్నాయి. ఈ క్షుద్రపూజల పై ఇప్పటివరకు కేసీఆర్ ఫ్యామిలీ స్పందించలేదు కానీ బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఆందోళన చెందుతున్నాయి.
గతంలో మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ రాజసూయ యాగం నిర్వహించడాన్ని బిజెపి జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ తప్పు పట్టారు. రాజసూయ యాగం పేరిట కెసీఆర్ జన వశీకరణ క్షుద్రపూజలు చేసినట్లు ఆరోపించిన సంగతి తెలిసిందే