posted on Apr 15, 2024 12:29PM
తెలుగుదేశం అధికార ప్రతినిథి పఠాభి అయితే తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఈ దాడికి స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ చేశారని ఆరోపించారు. జగన్ కు గాయం అయినా ఆయనకు బస్సులోనే ఫస్ట్ ఎయిడ్ చేయడాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ లో అంబులెన్స్ అందుబాటులో ఉన్నా ఎందుకు ఉపయోగించుకోలేదని ప్రశ్నించారు. గులకరాయి దాడి జరిగిన వెంటనే జరిగిన సంఘటనలను గమనిస్తే ఎవరికైనా సరే గత ఎన్నికలకు ముందు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో జగన్ పై జరిగిందని చెబుతున్న కోడి కత్తి దాడి గుర్తుకు రాకమానదు. ఎందుకంటే అప్పుడు కూడా దాడి విశాఖ విమానాశ్రయంలో జరిగింది.
అక్కడ అవసరమైన ఆధునిక వైద్య సదుపాయాలన్నీ ఉంటాయి. కానీ కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించుకోకుండా అలా రక్తగాయంతో విమానంలో హైదరాబాద్ కు వచ్చి ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు కాన్వాయ్ లో అంబులెన్స్ అందుబాటులో ఉన్నా జగన్ వైద్యుల సేవలు అవసరం లేదంటూ తాను యాత్ర చేస్తున్న బస్సులోనే గాయానికి ప్లాస్టర్ వేయించుకుని అందుకు సంబంధించిన విజువల్స్ ను బయటకు లీక్ చేశారు. దీనిని బట్టి చూస్తుంటే తీవ్ర ప్రజా వ్యతిరేకతను తగ్గించుకుని, మరో సారి ఎన్నికల సమరంలో గెలవాలంటే ప్రజల సానుభూతి పొందడం వినా మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చేసిన జగన్ గత ఎన్నికలలో కలిసి వచ్చిన దాడి డ్రామాను మరో సారి కొన్ని మార్పులు చేర్పులూ చేసి ప్రదర్శించారని అవగతమౌతోందని పఠాభి అంటున్నారు.
గత ఐదేళ్ల జగన్ పాలన ప్రజలలో ఆగ్రహం అవధులు దాటుతున్నదనడంలో సందేహం లేదని ఆయన అంటున్నారు. ఆ విషయం వైసీపీ అధినేత, సీఎం జగన్ సహా ఆయన పార్టీ నేతలూ, క్యాడర్ కు కూడా అర్ధమైపోయిందనీ అందుకే కనీసం సానుభూతితోనైనా గట్టెకుదామన్న దింపుడు కళ్లెం ఆశతో కోడికత్తి తరహా డ్రామాకు తెరలేపారని విమర్శించారు. అయితే కోడికత్తి డ్రామా రక్తికట్టినట్లుగా గులకరాయి దాడి డ్రామా రక్తికట్టలేదు సరికదా.. జనంలో వ్యతిరేకత మరింత పెరిగేందుకు దోహదపడిందని పఠాభి అంటున్నారు.