Home తెలంగాణ వాలంటీర్లందరూ వైపీపీ కార్యకర్తలే.. ఒప్పేసుకున్న ధర్మాన | dharmana accepts volunteers are ycp eorkers|...

వాలంటీర్లందరూ వైపీపీ కార్యకర్తలే.. ఒప్పేసుకున్న ధర్మాన | dharmana accepts volunteers are ycp eorkers| call| cadre| pressure| resign| work| party

0

posted on Apr 13, 2024 9:34AM

ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పినా అది నిజం అయ్యే అవకాశం లేదు. వాలంటీర్ల విషయంలో వైసీపీ ఎంత మొత్తుకున్నా.. ఎవరూ వారు ప్రభుత్వోద్యోగులని నమ్మడం లేదు. వాళ్లు వైసీపీ కార్యకర్తలేనని చెబుతున్నారు. అంతెందుకు వైసీపీ నేతలు, మంత్రులు కూడా వాలంటీర్లంతా మనవాళ్లేనని బహిరంగ సభల్లో చెబుతున్నారు. మనం చెప్పినట్లు వినే వాళ్లే ఉంటారు. లేని వాళ్లను తొలగించి వేరొకరిని నియమించుకుందామని గతంలో ఒక సారి మంత్రి అంబటిరాంబాబు వైసీపీ శ్రేణుల సదస్సులో బాహాటంగానే చెప్పేశారు. అలాంటి వాలంటీర్లను కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటే మాత్రం అధికార పార్టీ నేతలకు కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైంది. అవ్వా తాతలకు ఇంటి వద్దకు పెన్షన్ అందడం విపక్ష తెలుగుదేశం జీర్ణించుకోలేకపోతోందనీ, అందుకే వాలంటీర్లపై ఫిర్యాదులు చేసి వారిని పెన్షన్ల పంపిణీ నుంచి దూరం పెట్టేలా ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకువచ్చిందనీ గగ్గోలు పెట్టేసింది. ప్రభుత్వ సిబ్బంది చేత పెన్షన్లను పంపిణీ చేయించాలనీ, వృద్ధులకు ఇళ్లవద్దే పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, కోర్టులు చెప్పినప్పటికీ వృద్ధుల ఉసురు పోయేలా పెన్షన్ల పంపిణీని అస్తవ్యస్తం చేసి… శవరాజకీయం చేయడానికి కూడా వైసీపీ నేతలు వెనుకాడలేదు. చివరికి జనాలకు వాస్తవం తెలిసిపోయిందని గ్రహించి వైసీపీ చేసేదేం లేక మౌనం వహించాల్సి వచ్చింది. అయినా వాలంటీర్ల విషయంలో ఆ పార్టీ ఆశలు ఇంకా చావ లేదు. వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించి.. వారి సేవలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని ఎత్తులు వేసింది. తమ ప్రభుత్వం రాగానే మళ్లీ వాలంటీర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటామనీ ఊదరగొట్టింది. అయినా అతి తక్కువ మంది వాలంటీర్లు మాత్రమే రాజీనామాలు చేయడంతో ఇక ఎన్నికల ప్రచార సభా వేదికలపై నుంచి వారికి రాజీనామాలు చేసి వైసీపీకి పని చేయాలని పిలుపునివ్వడం మొదలెట్టింది. 

అయితే అబద్ధాలు చెప్పే వాళ్లకి జ్ణాపకశక్తి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ అబద్ధం చెప్పారో గుర్తు లేకపోతే మంత్రి ధర్మాన ప్రసాదరావులా నవ్వుల పాలు కావలసి ఉంటింది. ఎన్నికల సంఘానికీ, కోర్టులకూ వాలంటీర్లు వైసీపీకి చెందిన వారు కారనీ, వారు ఉద్యోగులనీ, పెన్షన్ల పంపిణీ కోసం వారిని వినియోగించుకుంటున్నామనీ పదే పదే చెప్పిన సంగతి మరచిపోయి ఆయన తాజాగా శ్రీకాకుళంలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని చెప్పుకొచ్చారు. అలా చెప్పి వారిని పార్టీకి అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నించారు. వాలంటీర్లంతా రాజీనామా చేసి ఎన్నికలలో వైసీపీ విజయం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.  

అంతే కాదు వైసీపీ మోడ్ ఆఫ్ అపరెండీ ఎలా ఉంటుందో కూడా ధర్మాన ఆ సమావేశంలో పూసగుచ్చినట్లు చెప్పేశారు. ఎన్నికలలోనే కదా మనం ఓటర్లకు కనిపించేది. మళ్లీ ఐదేళ్ల వరకూ వారి వద్దకు వెళ్లం. మన వాలంటీర్లు అలా కాదు ప్రతి 50 గృహాలకూ ఒకరిని కేటాయించాం కనుక వారి సేవలు ఇప్పుడు మనకు అవసరం. అందుకే వాలంటీర్లందరినీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకోవాలని ధర్మాన చెప్పారు. ఒక వేళ అలా చేయడానికి నిబంధనలు అడ్డు వస్తాయంటే వారందరి చేతా రాజీనామాలు చేయించేయండి. మళ్లీ మన ప్రభుత్వం వచ్చాకా వారిని ఏం చేయాలో ఆలోచిద్దాం అని బాహాటంగానే చెప్పేశారు.  

అయినా ఇంత కాలంగా వైసీపీ హయాంలో వాలంటీర్లుగా పని చేస్తున్న వారందరికీ జగన్ పార్టీ తీరు తెన్నూ బాగానే అర్ధమైంది. అందుకే పార్టీ అధినేత సహా కీలక నేతలంతా వాలంటీర్లను రాజీనామా చేయమని హుకుంల మీద హుకుంలు జారీ చేస్తున్నా అతి తక్కువ మంది తప్ప ఎవరూ రాజీనామా చేయడానికి ముందుకు రావడం లేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం తాము వైసీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటామని తెగేసి చెబుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే ప్రశ్నే లేదనీ, వారి సేవలను తమ ప్రభుత్వంలో మంచి పనుల కోసం వినియోగించుకుంటామనీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన తరువాత వారికి తత్వం బోధపడింది.

ఇంత కాలం తమను జగన్ సర్కార్ వెట్టి చాకిరీ కోసం ఎలా వాడుకుందో అర్ధమైంది. అందుకే రాజీనామాలు చేయం, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించం అని తెగేసి చెబుతున్నారు. కొందరైతే అధికార పార్టీ  ఒత్తిడులకు తట్టుకోలేక రాజీనామాలు చేసినా వెంటనే తెలుగుదేశం గూటికి చేరు తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక పార్టీ  శ్రేణులను వాలంటీర్లపైకి రెచ్చగొట్టి వారిని వేధించే కార్యక్రమానికి వైసీపీ నేతలు రెడీ అయిపోయారని తాజాగా మంత్రి ధర్మాన మాటలను బట్టి అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Exit mobile version