సార్వత్రిక ఎన్నికలకు నెల రోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ నేత ముద్దగోని రామ్మోహన్ గౌడ్ దంపతులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వారు హస్తం పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. రామ్మోహన్ గౌడ్ 2014, 2018లలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ రెండుసార్లు కూడా 12వేలు, 17వేల స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. 2014లో ఆర్ కృష్ణయ్య చేతిలో, 2018లో సుధీర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2023లో బీఆర్ఎస్ సుధీర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చింది.
అంతకుముందు, మక్తల్ బీజేపీ నేత జలంధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు సంగారెడ్డి ఇంచార్జ్ పులిమామిడి రాజు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్, మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు ఉన్నారు.