తాలు, తేమ పేరుతో దోపిడీ
సాయంత్రం సమయంలో కొనుగోళ్లు(Paddy Procurement) ప్రారంభించిన వ్యాపారులు ధాన్యంలో తేమ, తాలు సాకుతో క్వింటా ధాన్యానికి రూ.1,551, రూ.1,569, రూ.1,658 చొప్పున ధర నిర్ణయించారు. దీంతో కష్టపడి పంట పండించిన రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇదే విషయమై వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. వారు స్పందించకపోవడంతో మార్కెట్ కమిటీ కార్యాలయం(Jangaon Market Committee) ముందు నిరసన చేపట్టారు. ప్రభుత్వం క్వింటా ధర రూ.2,203 నిర్ణయిస్తే తమకు రూ.1,500 ఇవ్వడమేంటని వ్యాపారులు, అధికారులను నిలదీశారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయకుంటే ఆ మొత్తం ధాన్యాన్ని తగలబెడతామని స్పష్టం చేశారు. దీంతో మార్కెట్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సమాచారం అందు కున్న జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ వెంటనే మార్కెట్ యార్డుకు హుటాహుటిన తరలివచ్చారు. ఆందోళన చేపట్టిన రైతుల(Farmers Protest)తో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. మార్కెట్ అధికారులు ఇచ్చిన ధాన్యం చీటీలపై ట్రేడర్లు రాసిన ధరలను చూసి షాక్ అయ్యారు. ట్రేడర్ల తీరును తప్పుబడుతూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ ధర నిర్ణయించిన ట్రేడర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, దీనిపై ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజరు ప్రసాద్ కు సూచించారు. అలాగే రైతులు దోపిడీకి గురవుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన మార్కెట్ కార్యదర్శిని కూడా సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని, కనీస మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విమరించారు.