Home తెలంగాణ  తెలంగాణలో రేపట్నుంచి మూడు రోజుల పాటు జల్లులు 

 తెలంగాణలో రేపట్నుంచి మూడు రోజుల పాటు జల్లులు 

0

posted on Apr 6, 2024 5:33PM

భానుడి ప్రతాపంతో తెలంగాణ నిప్పుల కుంపటిలా మారింది. శుక్రవారం రాష్ట్రంలో రికార్టు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాలుగు జిల్లాల్లో 43.5, మరో తొమ్మిది జిల్లాల్లో 43.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యాయి. ఏప్రిల్‌ మొదటి వారంలోనే ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి అని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో సంగారెడ్డి, మెదక్‌, హైదరాబాద్‌ మినహా మిగతా అన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు.అయితే మండు వేసవిలో వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉరుములతో కూడిన వర్షం ఏప్రిల్ 9 వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుందని చెప్పింది.ఏప్రిల్ 8న నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లె, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన వేసవిని ఎదుర్కొంటున్న రాష్ట్ర వాసులకు తెలంగాణలో వర్షాలు ఉపశమనం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Exit mobile version