posted on Apr 6, 2024 11:53AM
కడప ఎంపీ ఎన్నిక అజెండాగా వివేకా హత్య కేసు
వైఎస్ బిడ్డ వైపా.. వివేకా హంతకుడివైపా అంటూ షర్మిల ప్రచారం
అన్నిటికంటే జగన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల ప్రజలలో సెంటిమెంట్ రగల్చడంలో సక్సెస్ అయ్యారు. ఆ తరువాత వైఎస్ సీఎంగా ఉన్నంత కాలం ఎన్నడూ బహిరంగంగా కనిపించని ఆయన సతీమణి విజయమ్మ కుమారుడి కోసం బయటకు వచ్చి ప్రచారం చేయడం కూడా కలిసి వచ్చింది. ఇక సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకా హత్య, విశాఖ విమానాశ్రయంలో జగన్ పై జరిగిందని చెబుతున్న కోడికత్తి దాడి సంఘటనలు కూడా జగన్ పై ప్రజల సానుభూతి వెల్లువెత్తడానికి దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు అంటే 2024 ఎన్నికల ముంగిట నాడు జగన్ విజయానికి దోహదం చేసిన ప్రతి అంశమూ ఇప్పుడు ప్రతికూలంగా మారింది. ముఖ్యంగా జగన్ సొంత చెల్లి షర్మిల అన్నకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం, వివేకా హత్య విషయంలో ఆమె నేరుగా జగన్ పై సంధిస్తున్న ఆరోపణాస్త్రాలూ ప్రజలలో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి.
కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న షర్మిల ప్రచారం ప్రారంభించారు. తొలి రోజునే ఆమె సూటిగా సుత్తి లేకుండా నేరుగా జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ బిడ్డగా తాను జనం ముందుకు నిలబడ్డాననీ, జగనన్న మాత్రం వివేకా హంతకుల వైపు ఉన్నారనీ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా కడప బరిలో వైఎస్ విడ్డ వివేకా హంతకుడితో తలపడుతోందని చెప్పారు. ఈ మాటలతో షర్మిల వైఎస్ బ్రాండ్ ను జగన్ కు దూరం చేసి తన సొంతం చేసుకున్నారు. షర్మిల ప్రచారం తొలి రోజునే ఆమె ప్రసంగం, ఆమె వ్యాఖ్యలు ఒక్క కడప నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. స్వయంగా షర్మిలే అవినాష్ ను వివేకా హంతకుడిగా అభివర్ణించడం, ఆమె మాటలు అక్షర సత్యాలని వివేకా కుమార్తె సునీత చెప్పడంతో కడపలో అవినాష్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొనడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా షర్మిలకు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా మంచి పరిచయాలు ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను దూరంపెట్టారన్న సానుభూతీ ఉంది. వివేకా హంతకుడికా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డకా ఓటు అన్న ఒక్క ప్రశ్నతో కడప ఎంపీ ఎన్నికల ఎజెండాగా వివేకా హత్య కేసును మార్చడంలో షర్మిల సక్సెస్ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.