Home తెలంగాణ వైసీపీ కంచుకోటకు బీటలు.. నెల్లూరులో వైసీపీ ఫినిష్షేనా? | ycp facing hard times in...

వైసీపీ కంచుకోటకు బీటలు.. నెల్లూరులో వైసీపీ ఫినిష్షేనా? | ycp facing hard times in nellore district| 2019| scene

0

posted on Apr 5, 2024 2:58PM

నెల్లూరు జిల్లా వైసీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీకి కంచుకోట. అంతకు ముందు ఆ జిల్లా కాంగ్రెస్ కు పెట్టని కోట. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి పెద్దగా ఆదరణ కనిపించిన దాఖలాలు లేవు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన తొలి ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో వైసీపీ ఏడు స్థానాలలో విజయం సాధించింది. మిగిలిన మూడు స్థానాలనూ తెలుగుదేశం గెలుచుకుంది. అంటే తెలుగుదేశంకు సానుకూలంగా ఉన్న సమయంలో కూడా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం హవా పెద్దగా కనిపించలేదు. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే ఆ ఎన్నికలలో వైసీపీ జిల్లాలో పదికి పది స్థానాలలో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. అయితే 2024 ఎన్నికల సమయానికి వచ్చేసిరి ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. వైసీపీకి పెట్టని కోట లాంటి నెల్లూరు జిల్లాలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్ పై వ్యతిరేకత రావడం అన్నది నెల్లూరు జిల్లాతోనే మొదలైందని చెప్పవచ్చు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

నెల్లూరులో వైసీపీకి వ్యతిరేకత ప్రబలంగా ఉందన్న విషయం ఏడాది కిందటి నుంచే అందరికీ అవగతం కావడం మొదలైంది. మొదటిగా ఆ జిల్లా నుంచే  ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరారు. ఆ తరువాత ఇటీవలే ఇంత కాలం వైసీపీకి జిల్లాలో బలమైన నేతగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ వైఖరితో విభేదించి వైసీపీని వీడి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు.  దీంతో జిల్లాలో తొలి సారిగా తెలుగుదేశం పార్టీ తిరుగులేని బలంతో కనిపిస్తోంది. జిల్లాలో పార్టీ బాగా  బలహీనపడటంతో జగన్ విశాఖ నుంచి విజయసాయిరెడ్డిని ఈ జిల్లాకు దిగుమతి చేశారు. ఆయనను నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. అయితే విజయసాయిరెడ్డి రాక తో జిల్లాలో వైసీపీ బలం పెరిగిన దాఖలాలు ఏ మాత్రం కనిపించడం లేదు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో కనీసం ఎనిమిదింటిలో విజయం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అంతే కాకుండా ఇటీవలి కాలంలో వెలువడిన పలు సర్వేల ప్రకారం జిల్లాలో ఆరుస్థానాలలో తెలుగుదేశం విజయం ఖాయం. మరో రెండు స్థానాలలో తెలుగుదేశం కూటమికే ఎడ్జ్ ఉంది. ఇక మిగిలిన నాలుగు స్థానాలలో రెండు చోట్ల పోటీ నువ్వా నేనా అనేటట్లుగా ఉన్న అంతిమంగా  ఆ రెండు స్థానాలూ కూడా తెలుగుదేశం ఖాతాలోనే పడే అవకాశాలున్నాయి. ఇక  సూళ్లూరుపేట నియోజకవర్గంలో మాత్రమే వైసీపీ విజయం ఖాయం అన్నట్లుగా పరిస్థితి ఉంది. అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో గెలుపు ఓటములను ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా మంత్రి కాకాణి గోవర్థన్ పోటీ చేస్తున్నారు. 

ఇక జగన్ ఎన్నో అంచనాలతో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టిన విజయసాయి రెడ్డి పరాజయం ఖాయమని సర్వేలే కాదు, పరిశీలకులు సైతం చెబుతున్నారు. ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో ఉన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారు.   మొత్తం మీద వైసీపీ కోటలాంటి నెల్లూరులో ఈ సారి తెలుగుదేశం పాగా వేయడం తథ్యమని చెబుతున్నారు. 

Exit mobile version