posted on Apr 5, 2024 9:30AM
వివేకా హత్య జరిగిన సమయంలో చోటు చేసుకున్న వరుస ఘటనలను నిరూపించేందుకు సాక్ష్యాలున్నాయంటూ ఓ వైపు ఫోన్ కాల్స్ ఆధారంగా తీగ లాగడంతో.. ఈ హత్య కేసులో డొంకంతా కదిలి..సూత్రదారులు ఎవరో తెలిపోయింది. అయినా సీబీఐ ఇంకా అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు మాత్రం వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దు చేయాలని సీబీఐ తెలంగాణ హైకోర్టును కోరింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుల్లో అవినాష్ రెడ్డి ఒకరు. ఈ కేసులో కీలక సాక్షిగా, అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి అవినాష్ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు విధించిన బెయిల్ షరతులను అవినాష్ ఉల్లంఘించారని పేర్కొంది.
అవినాష్, ఇతర నిందితులు సాక్షులను ప్రభావితం చేయగలరని దస్తగిరి తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై సీబీఐ వేసిన కౌంటర్ లో దస్తగిరి, అతని కుటుంబాన్ని అవినాష్, అతని వ్యక్తులు బెదిరించారని సీబీఐ ఆరోపించింది. దస్తగిరి సహా ఇతర సాక్షులను అవినాష్ బెదిరింపుల నుండి రక్షించడానికి, అతని బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీంతో ఇక అవినాష్ అరెస్టును అడ్డుకోవడం ఎవరి తరం కాదన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆపద్థర్మ ముఖ్యమంత్రి హోదాలో జగన్ అవినాష్ రెడ్డిని రక్షించే ప్రయత్నాలు చేయలేరని అంటున్నారు.