posted on Apr 5, 2024 10:25AM
రాజకీయ జీవితం ఇచ్చి ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరిన వల్లభనేని వంశీ.. ఆ పార్టీ అధినేత జగన్ మెప్పు కోసం ఎంత చేయాలో అంతా చేశారు. అయినా వైసీపీలో వంశీకి ఏమైనా గుర్తింపు దక్కిందా? ఆయన మాట ఎక్కడైనా చెల్లుబాటు అయ్యిందా అంటే ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును సీఎం జగన్ వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మార్చినప్పుడు వంశీ ట్విట్టర్ వేదికగా ఆ నిర్ణయంపై అభ్యంతరం తెలిపిన సందర్భంలో జగన్ నుంచి కనీస స్పందన లేదు.
2019 ఎన్నికల్లో జగన్ హావా తట్టుకొని వల్లభనేని వంశీ.. గన్నవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు… అక్కడితో ఆగకుండా టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీపై వంశీ విమర్శలు గుప్పించారు.. దీంతో ఎన్టీఆర్ ఫ్యామిలీలోని వారంతా మీడియా ముందుకు వచ్చి ఆ విమర్శలను ఖండించారు.. ఆ తరువాత వల్లభనేని వంశీ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో చంద్రబాబు ఫ్యామిలీకి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే అప్పటికే వల్లభనేని వంశీకి పూడ్చలేని నష్టం జరిగింది. ఇటు నమ్ముకున్న వైసీపీలో కూడా వర్గ రాజకీయాల కారణంగా ఆయనకు ఉక్కపోత ఆరంభమైంది. గన్నవరం నియోజకవర్గంలో అధికార ఫ్యాన్ పార్టీలో గ్రూప్‌ల రాజకీయం వంశీ కి పొమ్మనకుండా పొగపెట్టేసింది. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ కోసం ఆయన నేల విడిచి సాము చేయాల్సి వచ్చింది.
ఇక వల్లభనేని వంశీని ఈ సారి ఎలాగైనా ఎన్నికల్లో ఓడించాలన్న కృత నిశ్చయంతో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా వంశీపై పోటీ చేసి పరాజయం పాలైన యార్లగడ్డకు ఈ సారి తెలుగుదేశం అభ్యర్థిగా టికెట్ ఇచ్చి బరిలోకి దింపారు. మరో వైపు వైసీపీలో దుట్టా వర్గం వంశీకి సహాయనిరాకరణ చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో గన్నవరంలో వంశీ విజయం ఎంత మాత్రం సునాయాసం కాదని అంటున్నారు.
మొత్తం మీద నియోజకవర్గంలో సొంత పార్టీ వ్యతరేకతను తట్టుకుని పార్టీ టికెట్ సంపాదించగలిగినా వంశీకి ఇంటి పోరు తప్పడం లేదు. సొంత పార్టీ కేడర్ నుంచే మద్దతు కరవైంది. గన్నవరంలో ఆ సారి ప్రత్యేకత ఏమిటంటే.. గత ఎన్నికలలో ఎవరైతే ప్రత్యర్థులుగా తలపడ్డారో వారే ఇప్పుడు కూడా ప్రత్యర్థులు. అయితే పార్టీలు మారాయి. వల్లభనేని వంశీకి వైసీపీలో పలు వర్గాలు వ్యతిరేకంగా ఉంటే… తెలుగుదేశం క్యాడర్ మొత్తం యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా నిలిచింది. వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు.. వంశీకి ఇసుమంతైనా సహకరించడం లేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇక నియోజకవర్గంలో ఓటర్లు సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబు అండతో రాజకీయాల్లోకి వచ్చి ఆయన కుటుంబాన్నే దూషించడం వంశీకి పెద్ద మైనస్‌గా మారింది. ఇన్ని ప్రతికూలతల మధ్య నియోజకవర్గం నుంచి మరో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న వంశీ ఆశలు నెరవేరే అవకాశాలు అంతంత మాత్రమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.