posted on Apr 5, 2024 3:56PM
రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014లో కడప జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్క రాజం పేట స్థానం నుంచే విజయం సాధించింది. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఆ ఒక్క స్థానం కూడా దక్కలేదు. వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మరి 2024 ఎన్నికలలో పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నకు 2019 ఎన్నికల కంటే తెలుగుదేశం బెటర్ గా పెర్ఫార్మ్ చేసినా జిల్లాపై పట్టు మాత్రం వైసీపీదేనని పరిశీలకులు అంటున్నారు. కడప మినహా మిగిలిన రాయలసీమ జిల్లాలన్నిటిలో తెలుగుదేశం గట్టిగా పుంజుకుంటే కడప జిల్లాలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి పెద్దగా మెరుగుపడినట్లు కనిపించదు. గత ఎన్నికలలో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించడంలో విఫలమైన తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలలో ఒకటి రెండు స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలలో కడప జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలుచుకుంటుందని చెప్పదగ్గ నియోజకవర్గం ఒక్క మైదుకూరు మాత్రమేనని సర్వేలు చెబుతున్నాయి. అలాగే రాజంపేట, కమలాపురం నియోజకవర్గాలలో వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతుండటంతో జిల్లాలో వైసీపీ ఏదో ఒక మేరకు నష్టపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలోకి దిగడంతో రాష్ట్రంలోనే ఈ సీటు హాట్ సీట్ గా మారిపోయింది. జగన్ కు స్వయానా చిన్నాన్న అయిన వైఎస్ వివేకా హత్య విషయంలో వివేకా కుమార్తె సునీత, జగన్ కు సొంత చెల్లెలు అయిన షర్మిలను ముక్తకంఠంతో అవినాష్ దోషి అని ఆరోపిస్తూ, అటువంటి వ్యక్తికి జగన్ అండగా నిలబడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత బాబాయ్ ను కిరాతకంగా హత్య చేసిన వ్యక్తులకు వత్తాసుగా నిలబడిన జగన్ కు, ఆయన పార్టీకీ ఓట్లు వేయవద్దంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా షర్మిలే అవినాష్ కు ప్రత్యర్థిగా కడప బరిలో దిగడంతో.. ఆమె వైసీపీ ఓట్లను ఏ మేరకు చీల్చుతారన్నదానిపై కడప లోక్ సభ నియోజకవర్గ ఫలితం ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద గత ఎన్నికలలో లా జీరో స్థానంతో సరిపెట్టుకోవడం కాకుండా తెలుగుదేశం బలంగా పుంజుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.