posted on Apr 1, 2024 10:35AM
చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో తొలి పరాజయాన్ని ఆదివారం (మార్చి 31) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో అందుకుంది. అయితే ధోనీ మాత్రం ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్నాడు. నాలుగు పదులు పైబడిన వయస్సులో కూడా తనలోని బ్యాటింగ్ పటిమ ఇసుమంతైనా తగ్గలేదని నిరూపించుకున్నాడు.
వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ లో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్ రాణించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్ నర్ణీత 20 ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 171 పరుగులు మాత్రమే చేసి ఈ సీజన్ లో తొలి ఓటమిని నమోదు చేసుకుంది.
అయితే ఈ మ్యాచ్ లో పరాజయం పాలైన ధోనీ ఫామ్ లోకి రావడంపై చెన్నై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సీజన్ లో తొలి సారిగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కిన ధోనీ తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు. ఆడినంత సేపూ పాత ధోనీని తలపించాడు. ధోనీ హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ మొత్తం అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన తొలి రోజుల నాటి ధోనీని తలపింపచేశాయి. ఈ మ్యాచ్ లో ధోనీ తాను ఎదుర్కొన్న 16 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 37 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.