posted on Apr 1, 2024 7:21AM
వైబ్రెంట్ ఇండియా గతంలో 14 సార్లు ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహించింది. ఈ సంస్థ ఇచ్చిన సర్వే ఫలితాలు 12 సార్లు నిజమయ్యాయి. దీంతో వైబ్రెంట్ ఇండియా సర్వే ఫలితాలంటే చాలా రాజకీయ పార్టీలు ఆవే తుది ఫలితాలుగా భావిస్తుంటాయి. వైబ్రెంట్ ఇండియా సర్వే వెలుగులోకి రాగానే వైసీపీ నేతల్లో ఆందోళన మరింత పెరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సొంత నియోజకవర్గాలను వదిలి వైసీపీ అధిష్టానం సూచన మేరకు కొత్త నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు వెళ్లిన వైసీపీ అభ్యర్థులు తమ ఓటమి ఖాయమన్న భావనకు వచ్చినట్లు చెబుతున్నారు, అనవసరంగా నియోజకవర్గం మారామని తమకు దగ్గర వ్యక్తుల వద్ద చెప్పుకొని బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
వైబ్రెంట్ ఇండియా ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23వ తేదీ వరకు సర్వే నిర్వహించింది. ఈ సర్వే కోసం 50,236 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఫోన్ కాల్స్ ద్వారా మరో 50వేల మంది అభిప్రాయాలు సేకరించింది. వైబ్రెంట్ ఇండియా సర్వే ఫలితాల ప్రకారం.. టీడీపీ, జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు 79 నియోజకవర్గాల్లో కచ్చితంగా విజయం సాధిస్తారు. మరో 20 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఎడ్జ్ లో ఉన్నారు. అంటే దాదాపు 99 సీట్లలో కూటమి అభ్యర్థులు విజయం పక్కా అని వైబ్రెంట్ సర్వే తేల్చేసింది. అధికార వైసీపీకి ఓటమి ఖాయమని, ఆ పార్టీ 29 సీట్లకే పరిమితమవుతుందని, ప్రజల్లో పోలింగ్ సమయం నాటికి ఏమైనా సానుభూతి, ఇతర అంశాలను ప్రభావితం చేస్తే మరో 18 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉందని వైబ్రెంట్ సర్వే పేర్కొంది. మరో 29 నియోజకవర్గాల్లో కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని, వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది. పూర్తి ఫలితాలను పరిశీలిస్తే తెలుగుదేశం కూటమి 115 – 120 స్థానాలు, వైసీపీ 55 – 60 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. పార్టీల వారిగా ఓటింగ్ శాశం పరిశీలిస్తే.. తెలుగుదేశం కూటమికి 42.26శాతం, వైసీపీకి 38.11శాతం ఓటింగ్ నమోదవుతుంది. 13.47శాతం ఓటింగ్ మాత్రం కూటమి, వైసీపీ అభ్యర్థుల్లో ఎవరికైనా పడే అవకాశం ఉందని, ఇతరులకు 6.16శాతం ఓటింగ్ నమోదవుతుందని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది.
వైబ్రెంట్ ఇండియా గతంలో నిర్వహించిన కొన్ని సర్వే ఫలితాలను పరిశీలిస్తే..
తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైబ్రెంట్ ఇండియా సర్వే నిర్వహించింది. సర్వే ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీకి 72-78 స్థానాలు వస్తాయని తేలింది. ఎన్నికల ఫలితాల్లో 88 సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 67 – 75 స్థానాలు వస్తాయని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు వచ్చాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 118-130 స్థానాలు వస్తాయని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వైబ్రెంట్ ఇండియా సర్వే నిర్వహించింది. సర్వే ఫలితాల్లో డీఎంకే 167 – 178 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఆ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే 159 నియోజకవర్గాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019లో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైబ్రెంట్ ఇండియా సర్వేలో వైసీపీకి 129 -139 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఫలితాల్లో వైసీపీకి 151 స్థానాలు వచ్చాయి.
వైబ్రెంట్ ఇండియా తాజా సర్వే ప్రకారం.. రాయలసీమలోని చిత్తూరు, కడప, ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో వైసీపీకి మెజార్టీ స్థానాలు వస్తాయని, శ్రీకాకుళం, విశాఖపట్టణం, తుర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధిస్తారని పేర్కొంది. వైబ్రెంట్ ఇండియా సర్వే ఫలితాలు గతంలో 90శాతం నిజం కావటం, ఆ సర్వే ఈసారి వైసీపీ ఓటమి ఖాయమని స్పష్టం చేయడంతో వైసీపీ అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.