Home తెలంగాణ దానం బ్యాక్ టు బీఆర్ఎస్? | danam| nagender back to brs| praise| kcr|...

దానం బ్యాక్ టు బీఆర్ఎస్? | danam| nagender back to brs| praise| kcr| reject| resign| mla| congress

0

posted on Mar 30, 2024 10:39AM

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి యూటర్న్ కు రెడీ అవుతున్నారా?  ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరుకుని సికిందరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ఖరారైన ఆయన మరో సారి యూటర్న్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారా? కాంగ్రెస్ కు జెల్ల కొట్టి మళ్లీ బీఆర్ఎస్ కండువా కప్పుకుని ఎమ్మెల్యేగా కొనసాగాలని భావిస్తున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఔననక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తొలి బీఆర్ఎస్ సిట్టింగ్ దానం నాగేందర్. ఆయన కాంగ్రెస్ గూటికి చేరడంపై ఎవరూ ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు. దానంకు అది అలవాటే అన్నట్లుగా నిర్లిప్తంగా తీసుకున్నారు. చివరికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయనపై పెద్దగా విమర్శలు రాలేదు. గతంలో కూడా ఆయన నిముషాలు, గంటలు, రోజుల వ్యవధిలో పార్టీలు మార్చేసిన చరిత్ర ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ ను సికిందరాబాద్ లోక్ సభ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.

అలా ప్రకటించే ముందు ఒక కండీషన్ పెట్టింది. అదేమిటంటే ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని. తొలుత అందుకు అంగీకరించిన దానం నాగేందర్ ఆ తరువాత ఎందుకో ముందు వెనుకలాడుతున్నారు. బహుశా  సికిందరాబాద్ నుంచి గెలిచే అవకాశాలు లేవని భావిస్తున్నారో ఏమో  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడుతున్నారు. ఆయన తీరుతో కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. ఒక వేళ  సికిందరాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నిక కాకుండా ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దానంకే పార్టీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చినా ఆయన రాజీనామాకు సరే అనడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోగా దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ దాఖలైంది.

దీంతో  కాంగ్రెస్ సికిందరాబాద్ నుంచి దానం బదులు మరో వ్యక్తిని నిలబెట్టాలని భావిస్తోంది. ఈ తరుణంలో దానం నాగేందర్  కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కేసీఆర్ చాలా మంచి నేత ఆయన చుట్టూ చేరిన వారు ఆయనను భ్రష్టుపట్టించారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో  చర్చనీయాంశంగా మారాయి. దానం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి మళ్లీ కారెక్కేందుకు సిద్ధపడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం బెటరన్నట్లు.. కాంగ్రెస్ అభ్యర్థిగా సికిందరాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేసి రిస్క్ తీసుకోవడం కంటే ఉన్న ఎమ్మెల్యే పదవిని కాపాడుకుంటే బెటర్ అని దానం భావిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.  

Exit mobile version