posted on Mar 30, 2024 5:58PM
తెలుగు యువత నేడు ఐటీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారంటే అందుకు చంద్రబాబు విజన్ కారణమనడంలో సందేహం లేదు. చంద్రబాబు చేసిన కృషి కారణంగా ఆ తరువాత కాలంలో ముఖ్యమంత్రులు ఎవరు మారినా, రాష్ట్రం విడిపోయినా హైదరాబాద్ అభివృద్ధి ఆగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు ఎనలేని కృషి చేశారు. అలాగే చంద్రబాబు తన ముందుచూపుతో పొరుగురాష్ట్రం తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్, ఏపీలోని అప్పటి ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ కుట్రలను తిప్పికొట్టారు. ఫలితంగా నేడు ఏపీలోని డెల్టా ప్రాంతానికి, నాలుగైదు జిల్లాలకు తాగు,సాగునీటికి ఎటువంటి ఇంబ్బందీ లేకుండా పోయింది. అదంతా చంద్రబాబు విజన్ చలవే.
రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీకి తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తన ముందుచూపుతో ఏపీకి అనేక ప్రయోజనాలు కలిగేలా చేశారు. 1956లో కృష్ణా నదిపై ఆధారపడిన సాగు ఆయకట్టు ఎంతో తేల్చి, దానికి అనుగుణంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి, వివాదాల పరిష్కారానికి నాటి దేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కృష్ణా వాటర్ డిస్బ్యూట్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. నాటి సుప్రీంకోర్టు జస్టిస్ రణధీర్ సింగ్ బచావత్ ను ట్రిబ్యునల్ చైర్మన్ గా నియమించారు. దాని ప్రకారం ఏపీలో 7,278 చదరపు కిలో మీటర్ల స్థిర ఆయకట్టును నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ ఎగువన ఉన్న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికథలు పడ్డా ఏపీ ఆయకట్టుకు నాటి చట్టం ప్రకారం కృష్ణా జలాలను ఇవ్వాల్సిందే. 58ఏళ్ల తరువాత ఏపీ విడిపోవటంతో.. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రాలోని అప్పటి ప్రతిపక్ష పార్టీ కుట్రల వల్ల ఆంధ్ర డెల్టా ఆయకట్టుకు పొంచిఉన్న పెను ప్రమాదాన్ని చంద్రబాబు నాయుడు ముందుగానే పసిగట్టారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు పూర్తికావాలంటే ప్రాజెక్టు పరిధిలోని ముంపు మండలాలను ఆంధ్రా భూభాగంలో కలిపితేనే సీఎంగా బాధ్యతలను చేపడతానని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు తెగేసి చెప్పారు. ఫలితంగా పోలవరం నిర్మాణానికి ఎలాంటి అడ్డంకి లేకుండా చూశారు. ఆ తరువాత చంద్రబాబు పోలవరాన్ని పరుగులు పెట్టించారు. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చేశారు. కానీ, జగన్ హయాంలో పోలవరం నిర్మాణం ఎలా మరుగున పడిపోయిందో ఏపీ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైతే.. కృష్ణా నది నీళ్లు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా, లేదా సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడం ద్వారా మాత్రమే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు చేరుకుంటాయి. విజయవాడ నుంచి కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశంలో కొంత భూభాగానికి తాగు, సాగునీరు అందుతుంది. అయితే, చంద్రబాబు నాయుడు ఊహించినట్లే జరిగింది. హక్కుగా మనకు రావాల్సిన నీళ్లు ఒక్క చుక్క కిందకు రాకుండా అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర చేశారు. దీన్ని ముందుగానే పసిగట్టిన చంద్రాబు నాయుడు.. పోలవరం పూర్తయ్యే నాటికి సమయం పడుతుందని భావించి.. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. గోదావరి నదిని, కృష్ణా నదిని కలుపుతూ నదులను అనుసంధానించే ప్రాజెక్టే పట్టిసీమ. దీనిని చంద్రబాబు ఏడాదిలో పూర్తి చేశారు. పోలవరం కుడి కాలువను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తవ్వారు. గోదావరి నది నుండి పట్టిసీమద్వారా కాలువలోకి పంప్ చేయబడిన నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతుంది. సీఎంగా చంద్రబాబు తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్ల జూన్ నుండి ఆగస్టు మధ్య కాలంలో నీటి కొరతను ఎదుర్కొంటున్న డెల్టాలో 1.3 మిలియన్ ఎకరాలు సాగుచేసే వేలాది మంది రైతులకు సహాయపడింది. తాగునీటికి ఎంతగానో ఉపయోగపడింది. చంద్రబాబు ముందుచూపు ద్వారా ఇప్పటి వరకు పట్టిసీమ నీటి ద్వారా జరిగిన సంపద సృష్టి రూ. 25వేల కోట్లపైమాటే.
చంద్రబాబు కృషితో ఏడాదిలో రూ. 1,660 కోట్ల ఖర్చుతో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేశారు. అయితే, ఇందులో అవినీతి జరిగిందని అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ తీవ్రస్థాయి ఆరోపణలు చేసింది. పట్టిసీమ వద్దంటూ సుప్రీం కోర్టుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు పట్టిసీమ మోటర్ బటన్ నొక్కకపోతే కృష్ణా ఆయకట్టు లేదు.. నాలుగు జిల్లాలకు తాగునీరు లేదు. చంద్రబాబు ఏ పని చేసినా ముందు చూపుతో చేస్తారు.. ప్రజల బాగుకోసం చేస్తారని పట్టిసీమ ద్వారా మరోసారి నిరూపితమైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టిసీమ అవసరం లేదు, అదో దండగ ప్రాజెక్టు అంటూ రంకెలేసిన జగన్ అండ్ కో.. అధికారంలోకి వచ్చిన తవాత డెల్డా ప్రాంతానికి నీళ్లివ్వాలంటే వారికి పట్టిసీమే దిక్కైంది. ఇలా భవిష్యత్ అవసరాలను, ప్రత్యర్థుల కుట్రలను ముందుగానే పసిగట్టి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు ఎదురు కాకుండా చూడటంలో చంద్రబాబు ఎప్పుడూ నంబర్ వన్ గా ఉంటారు. అందుకే ప్రజలు తాము ఇబ్బందుల్లో ఉన్న ప్రతి సారీ చంద్రబాబు వైపే చూస్తారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు.