కౌరవ సోదరులకు, శకునికి భయం కలిగింది. ధర్మాధర్మ విచక్షణా జ్ఞానం కల భీష్మాచార్యుడు జరగబోయే వినాశనాన్ని గ్రహించి మౌనం దాల్చాడు. ద్రోణుడు, కృపాచార్యుడు వంటి వీరులు ఇక జరగబోయే పరిణామాలను ఊహించసాగారు. ధృతరాష్ట్రుడు చింతలో మునిగిపోయాడు. నిద్ర, ఆహారంపైన వ్యామోహం చచ్చిపోయింది. మనశ్శాంతి కరువయ్యింది. మనసుకు కొంత ఊరట కావాలి. అందుకు హితవచనాలు వినాలి. వాటితో మనసుకు కాస్తంత స్వాంతన ఉంటుందని భావించాడు. అందుకు సమర్ధుడు సర్వ ధర్మశాస్త కోవిదుదైన విదురుడేనని అతడికి కబురు చేశాడు. విదురుడు వచ్చి ధృతరాష్ట్రుడి ఆంతర్యం గ్రహించాడు. అనేక విషయాల గురించి అతడికి వివరించాడు. అనేక నీతులను, ధర్మాలను బోధించాడు. ధృతరాష్ట్రుడికి విదురుడు బోధించిన నీతులన్నీ ఆచరింపతగినవి కానీ, పుత్రప్రేమ వల్ల ధృతరాష్ట్రుడు మనస్సును కూడా అంధకారం వైకల్యంలో ఉంచుకున్నాడు.