Home తెలంగాణ మల్కాజ్ గిరి విషయంలో రేవంత్ తప్పటడుగు? | revanth wrong step| malkagigiri| candidate| non|...

మల్కాజ్ గిరి విషయంలో రేవంత్ తప్పటడుగు? | revanth wrong step| malkagigiri| candidate| non| local| tough| fight| etala

0

posted on Mar 22, 2024 10:03AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపి అధికారంలోకి తీసుకువచ్చి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా వేగంగా అడుగులు వేయడమే కాకుండా 2024 సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్ సభ స్థానాలను కైవశం చేసుకునే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎలాగైనా రాష్ట్రంలో కనీసం 12 లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే ధైర్యంగా లోక్ సభ ఎన్నికలు తన 100 రోజుల పాలనకు రిఫరెండం అని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం పట్ల ప్రజలలో సానుకూలత పెరిగేలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలలో చాలా వరకూ తాను చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే నెరవేర్చారు. దీంతో రేవంత్  సర్కార్ మాటల సర్కార్ కాదు, చేతల సర్కార్ అని జనంలో ఒక అభిప్రాయం ఏర్పడింది. అదే విధంగా పాలనలో సైతం తనదైన ముద్ర చూపుతూ సాగుతున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో కానీ, గత ప్రభుత్వ అవినీతిపై విచారణ వేగవంతం చేయడంలో కానీ దూకుడు చూపుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష బీజేపీని బలహీన పరచడంలోనూ వేగంగా కదులు తున్నారు. అలాగే లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తనదైన మార్క్ చూపుతున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ అంటూ.. తన సిఫారసులను పార్టీ హైకమాండ్ పరిగణనలోనికి తీసుకునే విధంగా కన్విన్స్ చేయగలుగుతున్నారు. 

అయితే మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఆయన తప్పటడుగు వేశారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేసిన కొడంగల్ స్థానం నుంచి పరాజయం పాలైన తరువాత ఆయన 2019 సార్వత్రిక ఎన్నికలలో మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగి 10వేల900 ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆయన ఎంపీగా ఉన్నా కూడా మల్కాజ్ గిరి నియోజకవర్గంపై పెద్దగా దృష్టి సారించలేదనీ, దీంతో కాంగ్రెస్ ఆ నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించడంలో విఫలమైందనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి.  ఆ కారణంగానే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కించుకోలేకపోయిందని చెబుతున్నారు.  

ఇక ఇప్పుడు రానున్న లోక్ సభ ఎన్నికలలో మల్కాజ్ గిరి స్థానం నుంచి కాంగ్రెస్ విజయం సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా ఏకపక్ష నిర్ణయంతో సునీతామహేందర్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలని భావించడం, అందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..  ఆ నియోజకవర్గ ఇన్ చార్జ్ తుమ్మల నాగేశ్వరరావు పార్టీ సమావేశాలకు, కార్యక్రమాలకూ దూరంగా ఉండటం ఎన్నికలలో కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం ఎంతమాత్రం కాదని పరిశీలకులు అంటున్నారు. పైగా మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీలో ఉండటం, ఆయనకు బీఆర్ ఎస్ శ్రేణులలో ఉన్న పలుకుబడి, మల్కాజ్ గిరి నియోజకవర్గంలో స్వతహాగా బీజేపీకి ఉన్న బలం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండగా, కాంగ్రెస్ కు మాత్రం అంతర్గత విభేదాల కారణంగా కాంగ్రెస్ కు ఒకింత నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని అంటున్నారు.  

అలాగే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం ఆ పార్టీ ఇక్కడ ఎంత బలంగా ఉందో తెలియజేస్తున్నదని అంటున్నారు. అయితే మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి యాక్టివ్ గా లేకపోవడం, ఆయన బీఆర్ఎస్ ను వీడతానని ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్  గత అసెంబ్లీ ఎన్నికల నాటి బలం ఉండే అవకాశం లేదు. అయినా బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి స్థానికుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. మొత్తం మీద రాగిడి లక్ష్మారెడ్డి, ఈటల వంటి బలమైన నాయకుల నుంచి పోటీని తట్టుకుని విజయం సాధించాలంటే కాంగ్రెస్ మల్కాజ్ గిరి నుంచి బలమైన అభ్యర్థిని నిలబెట్టడం అవసరం,

అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతా రెడ్డిని ఖరారు చేశారు. ఈ ఎంపికపైనే పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపాటి హనుమంతరావు టికెట్ ఆశించారు.  పట్నం సునీతా రెడ్డి స్థానికేతరురాలు కావడం,  కాంగ్రెస్ కు ఇక్కడ క్షేత్ర స్థాయిలో పెద్దగా పట్టు లేకపోవడం, మైనంపాటి వర్గీయులు ఏ మేరకు సునీతారెడ్డికి సహకారం అందిస్తారన్న అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించడం అంత సులువు కాదన్న అభిప్రాయం పరిశీలకులలోనే కాకుండా, పార్టీ క్యాడర్ నుంచి కూడా వ్యక్తం అవుతున్నది.  మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థి ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డి తప్పటడుగు వేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ విజయం కోసం చెమటోడ్చి కష్టపడక తప్పదని అంటున్నారు. 

Exit mobile version