Home తెలంగాణ వైసీపీ పవన్ ధ్యానం?.. పిఠాపురం జపం! | ycp concentration on pithapuram only| roja|...

వైసీపీ పవన్ ధ్యానం?.. పిఠాపురం జపం! | ycp concentration on pithapuram only| roja| ambati| gudivada| vellampalli| belittle| pawan

0

posted on Mar 21, 2024 4:39PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎన్నికల హీట్ పీక్స్ కు చేరింది. ఏపీ అందుకు మినహాయింపేమీ కాదు. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత ఏపీలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీ అధినాయకత్వం కానీ, ఆ పార్టీ నేతలు కానీ ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, పాతిక లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయని భావిస్తున్నట్లు కనిపించడం లేదు. ఆ పార్టీ మొత్తం తన శక్తియుక్తులన్నీ పిఠాపురంలో విజయం సాధించడంపైనే వెచ్చిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేలా వైసీపీ నేతల తీరు ఉన్నది. ఇంకా క్లారిటీతో చెప్పాలంటే రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోందా? ఆ నియోజకవర్గంలో విజయం అధికారపార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చతురంగ బలాలనూ అక్కడే మోహరించిందా అన్నట్లుగా పరిస్థితి ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీతను వైసీపీ నిలబెట్టింది. నియోజకవర్గంలో పవన్ విజయం నల్లేరు మీద బండినడకేనని అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న రాజకీయ నాయకులు చెబుతున్నారు. పరిశీలకుల విశ్లేషణలూ ఆ దిశగానే ఉన్నాయి. అయితే తమ అధినేత మనసెరిగి మసులుకునే వైసీపీ నాయకులు మాత్రం  అక్కడ పవన్ ఓటమే వైసీపీ ఏకైక లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జగన్ దృష్టిలో పడాలంటే పవన్ కల్యాణ్ ను తక్కువ చేసి చూపడం, మాట్లాడటం ఒక్కటే మార్గమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధినేత అభ్యర్థుల జాబితా విడుదల చేయకముందు పార్టీ టికెట్ దక్కించుకోవడం కోసం అలా చేశారంటే ఏదో అర్ధం చేసుకోవచ్చు. కానీ అభ్యర్థుల ఎంపిక అయిపోయింది. ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారన్నది తేలిపోయింది.  అయినా వైసీపీలో, వైసీపీ నేతలలో  పవన్ భజన పట్ల ఉన్న ఆసక్తి (భజన అంటే పొగడడమే కాదు..అదే పనిగా తెగడడం కూడా) తమతమ నియోజకవర్గాలలో ప్రచారంపై కనిపించడం లేదు. 

ఇలా  పవన్ ను తక్కువ చేసి మాట్లాడి జగన్ దృష్టిలో పడి తరించిపోదామని తాపత్రేయ పడుతున్న వారిలో వెల్లంపల్లి శ్రీనివాస్, రోజా, అంబటిరాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి వారు కూడా ఉన్నారు. వీరంతా వచ్చే ఎన్నికలలో  తమ తమ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నవారే. అంతే కాదు, ఆయా నియోజకవర్గాలలో వారి  విజయవకాశాలే అంతంత మాత్రంగా ఉన్నాయని పలు సర్వేలు పేర్కొన్నారు కూడా. సర్వేల వరకూ ఎందుకు పార్టీ అధినేత జగన్ స్వయంగా నిర్వహించుకున్న సర్వేలలో కూడా వీరి గెలుపు అవకాశాలు అంతంత మాత్రమే అని తేలింది. దీంతో చివరి నిముషం వరకూ వీరికి టికెట్లు ఇవ్వాలా వద్దా అన్న విషయాన్ని జగన్ తేల్చుకోలేకపోయారు. చివరికి అనివార్యంగానో, మరో అభ్యర్థి దొరకకో జగన్ వీరికి టికెట్లు ఇవ్వాల్సి  వచ్చింది.

ఇప్పటికీ వీరికి ఆయా నియోజకవర్గాలలో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయినా తమ నియోజరవర్గం కంటే వీరికి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపైనే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు తోస్తున్నది. అందుకే ఒకింత అతిశయోక్తి అనిపించినా.. తమ ఓటమి ఎటూ ఖాయమని భావించడంతో కనీసం జగన్ దృష్టిలోనైనా తమ లాయల్టీని కాపాడుకోవాలన్న తాపత్రయంతో వీరు పవన్ కల్యాణ్ పై దూషణలు, విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనిపిస్తోంది. ఇక జగన్ కూడా మిగిలిన 174 అసెంబ్లీ నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా పర్వాలేదు.. పిఠాపురంలో పార్టీ విజయం ఒక్కటి చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  ఇక వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం కూడా పిఠాపురంలో పవన్ పరాజయం ఖాయమంటూ, హేతు రహితంగా కుల సమీకరణాలపై కథనాలను వండి వారుస్తున్నది. వైసీపీ సామాజిక మాధ్యమ విభాగంలోని పోస్టులను గమనిస్తే ఏపీలో పిఠాపురం మినహా మిగిలిన ఏ నియోజకవర్గంలోనూ వైసీపీ పోటీలో లేదా అనిపించక మానదని పరిశీలకులు అంటున్నారు.

అంతలా సజ్జల భార్గవ్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ సోషల్ మీడియా సైన్యం పిఠాపురం నియోజకవర్గంపైనే  దృష్టి మొత్తం కేంద్రీకరించింది. ఇక త్వరలో జనసేనాని పవన్ కల్యాణ్ తాను పోటీ చేయనున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇక అప్పుడు వైసీపీ పవన్ వ్యతిరేక ప్రచార పిచ్చి మరో స్థాయికి చేరుతుందనడంలో సందేహం లేదని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఎటూ ఎడ్జ్ ఉంది. దానికి తోడు ఇప్పుడు తెలుగుదేశం మద్దతు కూడా తోడు కావడంతో అక్కడ కూటమి అభ్యర్థిగా జనసేనాని విజయంపై ఎవరికీ ఢోకా లేదు అన్న పరిస్థితి ఉంది. అక్కడ పవన్ కల్యాణ్ ఎంత భారీ మెజారిటీ సాధిస్తారన్నదే తమ ఆసక్తి అంతా అని తెలుగుదేశం, జనసేన శ్రేణులు అంటున్నాయి. మొత్తం మీద జగన్ పార్టీ అత్యుత్సాహం చూస్తుంటే పిఠాపురం స్థానాన్ని వెండిపల్లెంలో పెట్టి పవన్ కల్యాణ్ కు అందించేలా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఆ అత్యుత్సాహంతోనే రాష్ట్రంలోని మిగిలిన స్థానాల గెలుపు ఓటములను గాలికి వదిలేసినట్లు కనిపిస్తోందంటున్నారు.  

Exit mobile version