Home తెలంగాణ మళ్లీ బిజెపిలో చేరిన తమిళ సై 

మళ్లీ బిజెపిలో చేరిన తమిళ సై 

0

posted on Mar 20, 2024 4:10PM

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ బుధవారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. తమిళిసై అంతకుముందు బీజేపీ నాయకురాలు. ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. ఆ తర్వాత 2019లో తెలంగాణ గవర్నర్‌గా వచ్చారు. అయితే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు ఆమె తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.

గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తిరిగి బీజేపీలో చేరడంపై వామపక్ష పార్టీలు, డీఎంకే విమర్శలు గుప్పించాయి. వారి విమర్శలకు అన్నామలై గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉన్నత పదవులలో ఉండి… పదవీ విరమణ తర్వాత సాధారణ పౌరుడిలా ప్రజాసేవలో తరించడం కేవలం బీజేపీలో మాత్రమే సాధ్యమని చురక అంటించారు. ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నత పదవులు అస్సలు వదులుకోరని… ఎందుకంటే వారికి రాజకీయాలు అంటే కేవలం ఉన్నత పదవులు మాత్రమేనని విమర్శించారు. కానీ బీజేపీలో మాత్రం ప్రజాసేవ అన్నారు.

తమిళిసై సౌందర్యరాజన్ గవర్నర్‌గా బాగా పని చేశారని… ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకోవడం ఆమెకు ప్రజల మీద ఉన్న ప్రేమను తెలియజేస్తోందన్నారు. అదే సమయంలో ఆమె మళ్లీ బీజేపీలో చేరడం ద్వారా పార్టీ పట్ల ఆమె నిబద్ధతను తెలియజేస్తోందన్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా అయ్యేందుకు దోహదపడాలని ఆమె భావిస్తున్నారన్నారు.

రాజకీయ కుటుంబంలో  పుట్టి పెరిగిన సౌందర్యరాజన్‌కు బాల్యం నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉంది.  ఆమె మద్రాసు మెడికల్ కాలేజీలో చదువుతున్న సమయంలో విద్యార్థి నాయకురాలిగా ఎన్నికయ్యారు . ఆమె తమిళనాడు రాష్ట్ర బిజెపి రాష్ట్ర శాఖకు  సేవలందించారు. 2019న తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2019 సెప్టెంబర్ 9న తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ గవర్నర్ నరసింహాన్ తర్వాత సౌందర్య రాజన్  బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో తీవ్ర అవమానాలకు గురయ్యారు. కెసీఆర్ ప్రభుత్వానికి  తమిళసైకి మధ్య ఒక దశలో విభేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి.  

సౌందర్యరాజన్ ఇప్పటి వరకు ఎంపీ లేదా ఎమ్మెల్యే కావడానికి చేసిన అన్ని ప్రయత్నాలలో ఓడిపోయారు , రెండు అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంటు ఎన్నికలలో విఫలమయ్యారు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో తూత్తుక్కుడి నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమార్తె కనిమొళి కరుణానిధిపై ఆమె ఓడిపోయారు . తాజాగా సౌందర్య రాజన్ మళ్లీ బిజెపిలో చేరి వార్తలలోకెక్కారు. 

Exit mobile version