Home తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా.. ఎన్నికల బరిలోకి | tamilisye resign as governer| resignation|...

గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా.. ఎన్నికల బరిలోకి | tamilisye resign as governer| resignation| letter| draupadi| murmu| contest

0

posted on Mar 18, 2024 11:54AM

సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేశారు. ఆమె ఎన్నికల బరిలో దిగనున్నట్లు గట్టిగా వినిపిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వంతో విభేదాల కారణంగా నిత్యం వార్తలలో నిలిచిన తమిళి సై అప్పట్లోనే రాజకీయాలలోకి ప్రవేశించే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపించాయి. 

కేసీఆర్ హయాంలో తనకు రాష్ట్రప్రభుత్వం కనీసం ప్రొటోకాల్ కూడా ఇవ్వలేందంటూ చేసిన విమర్శలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.  అప్పట్లో రాజభవన్, ప్రగతి భవన్ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలూ రాజకీయ పార్టీల మధ్య విభేదాలను తలపించేవనడంలో సందేహం లేదు. సరే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం స్థానంలో రేవంత్ సర్కార్ కొలువుదీరిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య సయోధ్య కొనసాగుతున్నది. అయితే అనూహ్యంగా ఎన్నికల వేళ తమిళిసై తన పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది.

తమిళిసై తన రాజీనామాల లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం(మార్చి 18)న సమర్పించారు. తెలంగాణ గవర్నర్ పదవితో పాటు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా తమిళి సై రాజీనామా చేశారు. ఇలా ఉండగా ఆమె వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్నారని గట్టిగా ప్రచారం అవుతున్నది. తన సొంత రాష్ట్రమైన తమిళనాడు నుంచి ఆమె ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తున్నది.  తన పోటీ విషయంపై తమిళిసై ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. తెలంగాణ గవర్నర్ గా నియమితురాలు కావడానికి ముందు తమిళిసై తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేశారు.    

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని తుత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి  డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో  పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మరో సారి ఎన్నికల బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఆమె ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారన్న విషయంపై స్పష్టత లేదు. 

Exit mobile version