posted on Mar 18, 2024 9:05AM
అభివృద్ధి కోసం, అవినీతి రహిత పాలన కోసం ఏపీ జనం ఈ సారి ఎన్నికలలో ఎన్డీయే కూటమికే ఓటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేశారని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ప్రజాగళం సభలో ఆయన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ లతో కలిసి వేదిక పంచుకున్నారు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల జగన్ పాలన మొత్తం అవినీతి మయం అని విమర్శించారు. ప్రజలు జగన్ పాలనను అంతం చేసి ఎన్డీయేకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అయితే సభ ముగిసిన తరువాత గంటల వ్యవధిలోనే ఆయన తన ఎక్స్ ఖాతాలో వరుస పోస్టింగులు పెట్టడం విస్తుగొలిపింది. సభకు వచ్చిన ప్రజాస్పందనకు ముగ్ధుడైన మోడీ.. ఏపీ ప్రజలు జగన్ పాలనకు తెరదించడానికి నిర్ణయం తీసేసుకున్నారని ఫిక్స్ అయ్యారని బీజేపీ శ్రేణులే కాదు, ఆయన పోస్టులు చూసిన పరిశీలకులు సైతం చెబుతున్నారు.
ప్రజాగళం సభ ముగిసిన అనంతరం మోడీ చేసిన ట్వీట్లు ఇలా ఉన్నాయి.
మొదటి ట్వీట్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎన్డీయేకు మద్దతుగా నిలవాలని నిర్ణయించేసుకున్నారు. ఎన్డీయే అభివృద్ధి అజెండాకే వచ్చే ఎన్నికలలో ఓటు వేయాలని డిసైడైపోయారు. పల్నాడులో ప్రజాగళం సభ అదే చెప్పిందని పేర్కొన్నారు. ఆ తరువాత కొద్ది సేపటికే మరో ట్వీట్ చేసిన ప్రధాని ఆ ట్వీట్ లో చిలకలూరి పేట సభ ఘన విజయం ఎన్డీయేకు ప్రజా మద్దతును ఎలుగెత్తి చాటింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు మాత్రమే అభివృద్ధి చేయగలవనీ, వైసీపీ అవినీతి, దుష్టపాలనకు వ్యతిరేకంగా జనం ఆ జగన్ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలన్న నిశ్చయంతో ఉన్నారనీ పేర్కొన్నారు. ఇక ఆ తరువాత చేసిన ట్వీట్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రజలు ఎన్డీయే ఎంపీలు, ఎమ్మెల్యేలనూ అధికసంఖ్యలో ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
ఆ తరువాత కొద్ది సేపటికే తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు నివాళులర్పిస్తూ చేసిన ట్వీట్ లో ఏపీ పురోగతి కోసం ఎన్టీఆర్ దార్శనికతను కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ఎన్డీయే పని చేస్తుందని హామీ ఇచ్చారు. ఆ తరువాతి ట్వీట్ లో ఆయన ఏపీ ప్రజలు వైసీపీని ఓడించాలి, ఎన్డీయేకు ఓటు వేయాలన్న విషయాలలో స్పష్టంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆ తరువాత అవే ట్వీట్లను ప్రధాని మోడీ తెలుగులో కూడా పోస్టు చేశారు. మొత్తం మీద చిలకలూరి పేట సభకు వచ్చిన ప్రజాస్పందన సందేహాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ప్రజా నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా చాటిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.