TSRTC Buses To Medaram Jatara : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి(Medaram) వచ్చే భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) చేస్తుంది. భక్తులను తరలించేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా…..భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు తెలిపింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సోమవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పరిశీలించారు. తాడ్వాయిలోని టికెట్ ఇష్యుయింగ్ కౌంటర్లు, కామారంలో మూడు బస్సుల పార్కింగ్ పాయింట్లు, మేడారంలో 55 ఎకరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్, బేస్ క్యాంప్, 48 క్యూ రెయిలింగ్స్ ను పరిశీలించారు. అనంతరం మేడారంలోని హరిత హోటల్ లో టీఎస్ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు సమ్మక్క, సారలమ్మలను(Sammakka Saralamma) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు సమ్మక సారలమ్మలకు నిలువెత్తు బంగారాన్ని సమ్పరించుకున్నారు.