Home ఎంటర్టైన్మెంట్ ‘సైంధవ్’ మూవీ రివ్యూ

‘సైంధవ్’ మూవీ రివ్యూ

0

సినిమా పేరు: సైంధవ్

తారాగణం: వెంకటేష్, శ్రద్దా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, ఆర్య, నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాష్, బేబీ సారా, జిష్షూ సేన్ గుప్తా, ముఖేష్ రిషి

సంగీతం: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రాఫర్: ఎస్. మణికందన్

ప్రొడక్షన్ డిజైనర్: 

ఎడిటర్: గ్యారీ బి.హెచ్

రచన, దర్శకత్వం: శైలేష్ కొలను

నిర్మాత: వెంకట్‌ బోయనపల్లి

బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌

విడుదల తేదీ: జనవరి 13, 2024 

కుటుంబ కథా చిత్రాలతో తనదైన ముద్ర వేసిన విక్టరీ వెంకటేష్.. విభిన్న చిత్రాలతోనూ అలరిస్తుంటారు. తన తాజా ల్యాండ్ మార్క్ మూవీ కోసం యాక్షన్ థ్రిల్లర్ జానర్ ను ఎంచుకున్నారు. అదే వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా రూపొందిన ‘సైంధవ్’. ‘హిట్’ ఫ్రాంచైజ్ తో మెప్పించిన శైలేష్ కొలను దర్శకుడు కావడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ‘సైంధవ్’పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా ఎలా ఉంది? వెంకీ మామకి విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

సైంధవ్ కథ చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ సిటీలో జరుగుతుంది. సైంధవ్ కోనేరు అకా సైకో (వెంకటేష్) కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తుంటాడు. సైంధవ్‌కి గాయత్రి(బేబీ సారా పాలేకర్) అనే కుమార్తె ఉంటుంది. ఆ పాప బాధ్యతను క్యాబ్ డ్రైవర్ అయిన మనోగ్య(శ్రద్దా శ్రీనాథ్) చూసుకుంటుంది. అయితే గాయత్రికి అరుదైన వ్యాధి ఉందని, ఆమెని కాపాడుకోవాలంటే రూ.17 కోట్ల విలువైన ఇంజక్షన్ ఇవ్వాలని తెలుస్తుంది. కూతురిని కాపాడుకోవడం కోసం సైంధవ్ ఏం చేశాడు? అసలు అతని గతం ఏంటి? ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే కార్టెల్ గ్రూప్ కి అతని సంబంధం ఏంటి? చివరికి కూతురిని రక్షించుకోగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

‘హిట్-1’, ‘హిట్-2’ వంటి థ్రిల్లర్ సినిమాలతో మెప్పించిన దర్శకుడు శైలేష్ కొలను.. ఈసారి సైంధవ్ కోసం థ్రిల్లర్ జానర్ కి యాక్షన్, ఎమోషన్స్ ని జోడించాడు. కుమార్తెని కాపాడుకోవడం కోసం రూ.17 కోట్లు అవసరమవ్వడం.. దానికోసం వయలెన్స్ వదిలి సాధారణ జీవితం గడుపుతున్న తండ్రి, మళ్ళీ వయలెన్స్ బాట పట్టడం అనే పాయింట్ బాగుంది. అయితే ఆ పాయింట్ ని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. థ్రిల్లర్ సినిమాలకు కథనమే కీలకం. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలిగేలా చేయాలి. కానీ దర్శకుడు శైలేష్ మాత్రం స్క్రీన్ ప్లే కంటే.. యాక్షన్ సీన్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అనిపించింది. ఓ వైపు ప్రాణాపాయంలో ఉన్న కూతురు, మరోవైపు వైద్యానికి అవసరమైన డబ్బుల కోసం హీరో చేసే విన్యాసాలతో.. ఎమోషన్స్ ని అద్భుతంగా పండిస్తూ, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను కలిగించవచ్చు. కానీ సైంధవ్ విషయంలో అది జరగలేదు. కథ బాగున్నప్పటికీ, కథనంలో లోపం కారణంగా సినిమా సాదాసీదాగా నడిచింది. అక్కడక్కడా ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. తండ్రి, కూతురు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. పతాక సన్నివేశాలు మెప్పించాయి. అలాగే యాక్షన్ ప్రియులు మాత్రం ఈ సినిమాతో సంతృప్తి చెందే అవకాశముంది.

సంతోష్ నారాయణన్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. పాటలు, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే అనిపించాయి. ఎస్. మణికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. గ్యారీ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

సైంధవ్ కోనేరు అలియాస్ సైకో పాత్రలో వెంకటేష్ అదరగొట్టాడు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ మెప్పించింది. యాక్షన్ సన్నివేశాల్లో చెలరేగిపోయాడు. ఇక ఎమోషనల్ సీన్స్ లో ఎప్పటిలాగే కంటతడి పెట్టించాడు. మనోగ్య పాత్రలో శ్రద్దా శ్రీనాథ్ చక్కగా ఒదిగిపోయింది. వికాస్ మాలిక్ పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ తనదైన నటనతో కట్టిపడేసాడు. ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా ఉన్నంతలో తమ మార్క్ చూపించారు. బేబీ సారా, జిష్షూ సేన్ గుప్తా, ముఖేష్ రిషి, జయప్రకాష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

తెలుగువన్ పర్‌స్పెక్టివ్:

దర్శకుడు శైలేష్ కొలను ఎంచుకున్న కథాంశం బాగున్నప్పటికీ దానిని ఆసక్తికరంగా మలచడంతో కొంతవరకే సక్సెస్ అయ్యాడు. వెంకటేష్ నటన కోసం, యాక్షన్ సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ సన్నివేశాల కోసం ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు. అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఈ చిత్రం నచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా యాక్షన్ ప్రియులకు నచ్చే ఛాన్స్ ఉంది.

రేటింగ్: 2.5/5

Exit mobile version