సినిమా టాక్ ఎలా ఉన్నా భారీ వసూళ్లు రాబట్టగల హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలేవీ పూర్తి పాజిటివ్ టాక్ ని తెచ్చుకోలేదు. అయినప్పటికీ ఆ సినిమాలు రూ.100 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. ముఖ్యంగా మహేష్ గత చిత్రం ‘సర్కారు వారి పాట’ మొదటి రోజు డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ రూ.110 కోట్లకు పైగా షేర్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’ విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందని మహేష్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ ని తెచ్చుకుంటోంది. అదే సమయంలో ఈ సినిమా కోసం మహేష్ ఎంతో కష్టపడ్డాడని, మహేష్ వన్ మ్యాన్ షో కోసమైనా ఈ సినిమా చూడొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మహేష్ కి యూత్ తో పాటు.. ఈ జనరేషన్ స్టార్స్ కి సాధ్యంకాని విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ఆయన సినిమాలకు లాంగ్ రన్ ఉంటుంది, కంటెంట్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు వస్తుంటాయి. అదే ఇప్పుడు గుంటూరు కారంకి కలిసొచ్చే అవకాశముంది. టాక్ తో సంబంధం లేకుండా కేవలం మహేష్ సినిమా అని థియేటర్లకు వచ్చే ఆడియన్స్ ఎందరో ఉంటారు. పైగా మహేష్ వన్ మ్యాన్ షో అనే టాక్, దానికి తోడు సంక్రాంతి సీజన్ తోడైంది. ఈ లెక్కన ‘గుంటూరు కారం’ సులభంగా రూ.100 కోట్లకు పైగా షేర్ రాబడుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.