TS Pending Challan : పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు మరో ఛాన్స్ ఇచ్చింది. రాయితీపై చలాన్లు చెల్లింపు గడువు జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. రాయితీతో చలాన్ల చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. చలాన్ల చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారుల నుంచి ఫిర్యాదు వస్తున్న క్రమంలో… గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో డిసెంబర్ నాటికి 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. అయితే ఇవాళ్టి వరకూ వాహనదారులు 1.05 కోట్ల చలానాలు చెల్లించగా, వాటి నుంచి రూ.107 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం రాయితీ, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే.