పారిశుద్ధ్య కార్మికుల సమ్మె సైరన్
ఏపీలో పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా సమ్మె సైరన్ మోగించారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. దాదాపు 50 వేల మంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చిన సమ్మెచేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతం రూ. 26 వేలకు పెంచాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో చుట్టు పక్కల గ్రామాలను విలీనం చేయడంతో పని ఒత్తిడి పెరిగిందని కార్మికులు అంటున్నారు. పనికి తగిన వేతనం ఇవ్వడంలేదని ఆవేదన చెందుతున్నారు. కార్మికుల సంఖ్యను పెంచడం లేదని, దీంతో తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారని అంటున్నారు. పెరిగిన పని ఒత్తిడికి తగిన విధంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు నిరసనలకు దిగారు. ప్రస్తుతం ఒక్కో కార్మికుడికి రూ.15 వేల వేతనం, వెల్త్ ఎలవెన్స్ కింద రూ.6 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే.