Saturday, January 31, 2026
Home NEWS సీనియర్ల పైనే సీరియస్ టాపిక్..!

సీనియర్ల పైనే సీరియస్ టాపిక్..!

0
259
  • నామినేషన్ల తొలిరోజే జోరు
  • మున్సిపల్ బరిలో హేమాహేమీలు..
  •  10, 15, 23 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ బలాబలాలను ప్రదర్శిస్తూ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది.

10వ వార్డు: చైర్మన్ పీఠంపై నర్సింలు కన్ను!

పట్టణంలోని 10వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్లోళ్ల నర్సింలు అనుచర గణంతో వచ్చి నామినేషన్ వేశారు. గత మున్సిపల్ పాలకవర్గంలో ఆయన సతీమణి వైస్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో, ఈసారి ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో నర్సింలు ఉన్నారు. వార్డుపై పూర్తి పట్టు సాధించేందుకు ఆయన ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు.

15వ వార్డు: శోభారాణి ‘నాలుగో’ సారి గెలిచేనా?

15వ వార్డులో ఆసక్తికర పోరు నెలకొంది. బీఆర్ఎస్ తరపున హ్యాట్రిక్ కౌన్సిలర్ శోభారాణి తన నామినేషన్ దాఖలు చేశారు. వరుసగా మూడు సార్లు విజయం సాధించిన ఆమెకు, ఈసారి రిజర్వేషన్ ‘జనరల్’ కావడంతో గట్టి పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా భావిస్తున్న దివిటి ఎల్లప్ప కూడా బరిలో ఉండటంతో, విశ్లేషకులు ఇక్కడ హోరాహోరీ పోరు తప్పదని అంచనా వేస్తున్నారు. ఈ ‘జనరల్’ గండం గట్టెక్కి శోభారాణి నాలుగోసారి కౌన్సిల్ లో అడుగుపెడతారా అనేది వేచి చూడాలి.

23వ వార్డు: పరిమళ మళ్లీ పుంజుకునేనా?

గతంలో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న గడ్డల పరిమళ ఈసారి బీఆర్ఎస్ తరపున 23వ వార్డు నుంచి నామినేషన్ వేశారు. ఇటీవలే కాంగ్రెస్ వీడి గులాబీ గూటికి చేరిన ఆమె, గత ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఎదురైన ఓటమిని ఈసారి విజయంగా మార్చుకోవాలని చూస్తున్నారు. పాత పరిచయాలు, వార్డులో ఉన్న పట్టు తనను గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.తొలిరోజే నామినేషన్ల పర్వం ఊపందుకోవడంతో తాండూరు పట్టణంలోని చౌరస్తాలన్నీ రాజకీయ చర్చలతో హోరెత్తుతున్నాయి. అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here