
- ఓటర్ల జాబితాలో ‘గందరగోళం’.. అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా ఆగ్రహం!
- వార్డులు మారిన ఓట్లు.. సవరణలు లేని జాబితాతో ఓటర్ల అవస్థలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : స్థానిక ఓటర్ల జాబితా తయారీలో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల సవరణ జాబితాలో అసంఖ్యాకమైన తప్పులు దొర్లడంతో ఓటర్లు, రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే జాబితాను రూపొందించడం వల్లే ఈ గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నారు.ప్రస్తుత జాబితాలో ప్రధానంగా ఒక వార్డుకు చెందిన ఓటర్లు మరో వార్డులో నమోదవ్వడం పెద్ద సమస్యగా మారింది. కాలనీలు, వీధుల వారీగా విభజన చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం ప్రదర్శించారు. దీనివల్ల తమ సొంత వార్డులో ఓటు హక్కు కోల్పోయి, ఎక్కడో దూరంగా ఉన్న వార్డులకు వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఓటర్లు వాపోతున్నారు.
గత కొన్ని రోజుల కింద ఈ తప్పులపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, కొత్తగా వచ్చిన జాబితాలో ఎలాంటి మార్పులు లేకపోవడం గమనార్హం. “సవరణల పేరుతో కాలయాపన చేయడం తప్ప, క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్లను సరిదిద్దడంలో అధికారులు విఫలమయ్యారు” అని స్థానిక నాయకులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులైన ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని, అసలు అధికారులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా ఈ గందరగోళం వీడకపోవడంతో సామాన్య ఓటర్లు అయోమయంలో ఉన్నారు. ఒక వార్డులో నివాసం ఉంటూ, మరో వార్డులో ఓటు వేయడం వల్ల స్థానిక సమస్యలపై అడిగే హక్కు కోల్పోతామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం ఓటర్ల జాబితాపై దాదాపు 70 కు పైగా అభ్యంతరాలు వచ్చిన కనీస సవరణ కూడా అధికారులు చెయ్యకపోవడం విడ్డురం. ఒక్కో వార్డ్ లో 2వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. మరో వార్డ్ లో 3వేల కు పైగా ఓటర్లు ఉన్నారు. ఒక్కో వార్డ్ లో దాదాపు 400 పై చిలుకు ఓట్లు పెరగడం తో అభ్యర్థులు అయోమయం లో పడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఓటర్ల జాబితా గందరగోళం గా ఏర్పాడిందని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



