- మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఊరట..
- హైకోర్టులో బెయిల్ మంజూరు.. కేసు కొట్టివేయాలని మరో పిటిషన్
జనవాహిని ప్రతినిధి తాండూరు :తాండూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. గత మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తాండూరులో నమోదైన కేసులో రోహిత్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది పార్టీ నాయకులకు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ రోజున తాండూర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో పోలీసులు రోహిత్ రెడ్డి సహా తొమ్మిది మందిపై తాండూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా బెయిల్ ఇవ్వాలని కోరుతూ వారు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం, వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.బెయిల్ లభించిన వెంటనే రోహిత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై నమోదైన ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని, ఇందులో ఎటువంటి వాస్తవం లేదని పేర్కొంటూ, సదరు కేసును పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్పై హైకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం బెయిల్ రావడంతో రోహిత్ రెడ్డి వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



