రోడ్డు పనుల హామీ ఏమైంది..?

- 21 రోజులు గడిచినా రాయల్ కాంటలో పనులు మొదలుకాలేదు
- ఎమ్మెల్యే ఆదేశాలను అమలు చేయడంలో జాప్యంపై నిరసన గళం
- వెంటనే పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ నేత ఈర్షాద్ డిమాండ్
- మున్సిపల్ కమీషనర్ కు విజ్ఞప్తి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణం, 15వ వార్డులోని రాయల్ కాంట సమీపంలో రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించాలని బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమీషనర్‌ను కోరారు. గత 21 రోజుల క్రితం ఇక్కడ రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ నిరసనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈర్షాద్ తో పాటు ఇతర నేతలు, కాలనీ వాసులకు మద్దతు తెలిపారు. ఆ సమయంలో, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు స్పందించి, నెల రోజుల్లోగా రోడ్డు పనులు ప్రారంభిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ఆందోళనకారులు తమ నిరసనను విరమించుకున్నారు.
అయితే, అధికారులు హామీ ఇచ్చి 21 రోజులు గడిచినా ఇప్పటివరకు రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. దీంతో కాలనీవాసులు, బీఆర్ఎస్ నేత ఈర్షాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని అధికారులు వెంటనే నిలబెట్టుకోవాలని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాయల్ కాంట రోడ్డు పనులను వెంటనే మొదలుపెట్టాలని వారు మున్సిపల్ కమీషనర్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులు ఇచ్చిన హామీని ఆదమరిచి పనులను ఆలస్యం చేయవద్దని ఈర్షాద్ కోరారు.



