
- – దేశంలోనే ఎక్కడా లేని విధంగా మైనారిటీ పథకాలు
- మాజీ ఎమ్మెల్యే కృషిని మరువలేం
- -తాండూరు బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ ఎండీ యూనుస్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం దేశానికే ఆదర్శంగా నిలిచే పథకాలను ప్రవేశపెట్టిందని, తాండూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మైనారిటీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని తాండూరు మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ ఎండీ యూనుస్ అన్నారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ముస్లిం మైనారిటీలు ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగాలని షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా లక్షా నూట పదహారు రూపాయలు అందించి పేద కుటుంబాలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. వేల సంఖ్యలో మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
తాండూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎండీ యూనుస్ కొనియాడారు. పట్టణంలోని పలు మైనారిటీ కాలనీల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సిసి రోడ్లు, డ్రైనేజీలు, హైమాస్ట్ లైట్ల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఈద్గాల అభివృద్ధి, మసీదుల షాదీఖానాల నిర్మాణానికి రోహిత్ రెడ్డి చేసిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ, ఇతర కష్ట కాలాల్లోనూ కులమతాలకు అతీతంగా పైలెట్ రోహిత్ రెడ్డి మైనారిటీలకు అండగా నిలిచారని, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. మైనారిటీల ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకుడు రోహిత్ రెడ్డి అని, ఆయన నాయకత్వంలో మైనారిటీలంతా ఐక్యంగా ఉన్నామని ఎండీ యూనుస్ ఈ సందర్భంగా వెల్లడించారు. అదేవిధంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు మున్సిపల్ పరిధిలో అత్యధిక స్థానాలను గెలిచి చైర్ పర్సన్ పీఠాన్ని బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.



