- భావిగి భద్రేశ్వరాలయ షాపింగ్ కాంప్లెక్స్ సీజ్
- నిబంధనలకు విరుద్ధంగా 64 దుకాణాల నిర్మాణం
- కోర్టును ఆశ్రయించిన వీరశైవ యువధల్ మాజీ అధ్యక్షులు ప్రవీణ్ పటేల్
- అనుమతులు వచ్చే వరకు దుకాణాలు మూసివేయాలని న్యాయస్థానం ఆదేశం.
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భాగివి భద్రేశ్వర దేవాలయ దుకాణ సముదాయాల నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ నిర్మాణాలపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు సముదాయంలోని దుకాణాలను మూసివేయించారు.దేవాలయ పరిధిలో నిర్మించిన 64 దుకాణాలకు సంబంధించి దేవాదాయ శాఖ నుంచి గానీ, స్థానిక మున్సిపాలిటీ నుంచి గానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వీరశైవ సమాజ సభ్యులు ప్రవీణ్ పటేల్ కోర్టును ఆశ్రయించారు. పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, కేవలం లాభాపేక్షతోనే ఈ దుకాణాలను నిర్మించి, ఇష్టానుసారంగా కేటాయింపులు జరిపారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం.. నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేసే వరకు దుకాణాలను మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ సందర్భంగా ప్రవీణ్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ…..అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేవాలయ కమిటీ మరియు ఈఓ కుమ్మక్కై దాదాపు రూ. 3.5 కోట్ల విలువైన దుకాణాలను అక్రమంగా నిర్మించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి దేవాలయ ఆదాయానికి గండి కొట్టారు అని ఆరోపించారు. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం 5ఏళ్లకు ఒక సారి రిటైడర్లు వెయ్యాల్సి ఉంది. కానీ లైఫ్దే టైం సెటిల్మెంట్ అని వసూళ్లు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదాయ శాఖ చట్టం ప్రకారం వెంటనే పబ్లిక్ నోటిఫికేషన్ విడుదల చేయాలని,అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్లను వెంటనే దేవాదాయ శాఖ ఖాతాలో జమ చేయాలన్నారు. నియమ నిబంధనలు పాటించని అధికారులపై, రెవల్యూషన్ కమిటీపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కోర్టు ఆదేశాల నేపథ్యంలో, అధికారులు రంగంలోకి దిగి దుకాణాలను మూసివేయించారు. సరైన అనుమతులు పొంది, చట్టబద్ధంగా ప్రక్రియ పూర్తి చేసే వరకు ఈ దుకాణాలు తెరిచే ప్రసక్తి లేదని తెలుస్తోంది. ఈ పరిణామం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.






